గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన రామిశెట్టి శ్రీలక్ష్మి.. తన భర్త శ్రీనివాసరావు 6 నెలల నుంచి కనిపించటం లేదని నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్కి ఫిర్యాదు చేసింది. తన భర్త కనిపించకుండా పోవటానికి కారణం స్థానిక ఎమ్మెల్యే విడుదల రజినీ వ్యక్తిగత సహాయకుడు ఫణీంద్ర, అతని బంధువులు మద్దిబోయిన శివ అనీ.. వీరికి చిలకలూరిపేట టౌన్ సీఐ వెంకటేశ్వర్లు సాయం చేశారని బాధితురాలు ఆరోపించారు.
హైదరాబాద్‌కి చెందిన సంతోష్‌రెడ్డి అనే వ్యక్తితో ఆర్థిక లావాదేవీలు ఉండటం వలనే తన భర్తను అపహరించారని బాధితురాలు తెలిపింది. తన భర్త గురించి అడిగినందుకు.. చిలకలూరిపేటలో ఉన్న ఇంటిపై దాడి చేశారని అన్నారు. భర్త గురించి ఫిర్యాదు చేసేందుకు వెళ్తే... చిలకలూరిపేట సీఐ వెంకటేశ్వర్లు తనపై దాడికి దిగాడని వివరించారు.
న్యాయం జరుగుతుందనే ఆశతో ఎమ్మెల్యే విడుదల రజినీ ఇంటికి ఎన్నిసార్లు వెళ్లినా.. ఆమె పీఏ ఫణీంద్ర కలవనీయలేదని ఆరోపించారు. ఈ విషయంపై గుంటూరు జిల్లా గ్రామీణ ఎస్పీ విశాల్ గున్ని, నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డిలకు స్పందనలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు.
తన భర్త ఆచూకీ తెలిపి.. తనకు న్యాయం చేయాలంటూ సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్‌ను కలిసి, రాతపూర్వకంగా ఫిర్యాదును అందజేశారు. 6 నెలలుగా ఆర్థికంగా తీవ్ర అవస్థలు పడుతున్నామనీ ఆమె వాపోయారు.
ఇదీ చదవండి: రాజధాని గ్రామాల్లో 274వ రోజూ ఆందోళనలు