Waiting list increase in railway: రైళ్లలో రిజర్వేషన్లు మూడు నెలల ముందే అయిపోయాయి. అనేక రైళ్లలో నిరీక్షణ జాబితా(వెయిటింగ్ లిస్టు) పరిమితీ దాటేసింది. అదనంగా ప్రత్యేక రైళ్లు నడుపుతారని, ఉన్న రైళ్లకు అదనపు బోగీలను జోడిస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తున్నా.. నిరాశే ఎదురవుతోంది. రోజులు, వారాలు గడుస్తున్నా ప్రత్యేక రైళ్లు, అదనపు బోగీలపై ప్రకటన లేకపోవడం, నిరీక్షణ జాబితా పెరుగుతుండటంతో అనేకమంది టికెట్లు రద్దు చేసుకుంటున్నారు.
జనవరి 12న గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో 1,102 మంది నిరీక్షణ జాబితాలో ఉండగా.. 624 మంది టికెట్లు రద్దు చేసుకున్నారు. థర్డ్ ఏసీలోనే 384 మంది వెయిటింగ్ లిస్ట్ టికెట్లు తీసుకున్నారు. 11న వెయిటింగ్ జాబితాలో ఉన్న 784 మందిలో 285 మంది రద్దు చేసుకున్నారు. గత సంక్రాంతి సమయంలో పండగకు కొద్దిరోజులు ముందే రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. అప్పటికే చాలామంది ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు వంటి ప్రత్యామ్నాయాలు ఎంచుకున్నారు. రైళ్లు ఎక్కడానికి లక్షల మంది సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోకపోవడంతో రైల్వేశాఖ పెద్దఎత్తున ఆదాయాన్ని సైతం కోల్పోతోంది.
మూడు నెలలైనా మీనమేషాలే: సంక్రాంతి ప్రయాణ తేదీల్లో రైళ్ల రిజర్వేషన్లు సెప్టెంబరు రెండో వారం ఆఖర్లోనే అయిపోయాయి. ప్రధాన రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ భారీగా ఉంది. ఒక రైలును గరిష్ఠంగా 24 బోగీలతో నడిపించవచ్చు. అంతకంటే తక్కువ సంఖ్యలో ఉన్న రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేయవచ్చు. అయిదారొందలకుపైగా వెయిటింగ్ లిస్టు ఉన్న రైళ్లకు ఇదే మార్గం. అదే సమయంలో క్లోన్ రైళ్లనూ నడిపించొచ్చు. అయినప్పటికీ సంక్రాంతి ప్రత్యేక రైళ్లు, అదనపు బోగీలపై దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికీ నిర్ణయం వెలువరించకపోవడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
భారీగా వెయిటింగ్ లిస్టు
* దురంతో ఏసీ రైలులో 11న ప్రయాణానికి 333 మంది వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. గోదావరిలో జనవరి 13న 417 మంది ఈ జాబితాలో ఉన్నారు. కాచిగూడ-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌లో 11న 571 మంది వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. 11-13 తేదీల్లో చెన్నై నుంచి విజయవాడ వైపు వెళ్లే ప్రశాంతి, సంఘమిత్ర, గువాహటి, శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లలో భారీగా వెయిటింగ్ లిస్టు ఉంది.
* గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో 11న 547 మంది వెయిటింగ్ లిస్టులో ఉండగా.. స్లీపర్‌లోనే 389 మంది ఉన్నారు. స్లీపర్‌లో 12న, థర్డ్ ఏసీలో 12, 13 తేదీల్లో రిగ్రెట్‌కు చేరింది. కోకనాడ ఏసీ ఎక్స్‌ప్రెస్‌లో 11, 13 తేదీల్లో 200-240 వరకు వెయిటింగ్ లిస్టుంది. ‘నర్సాపూర్’లో 11-13 వరకు స్లీపర్, థర్డ్ ఏసీలో రిగ్రెట్‌కు చేరుకుంది.
* శబరి ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్‌లో 11వ తేదీన రిగ్రెట్ కనిపిస్తుండగా.. 12వ తేదీన ప్రయాణానికి ఏకంగా 770 మంది వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. దీంతో రిజర్వేషన్ అయ్యే అవకాశం లేదని 221 మంది టికెట్లు రద్దు చేసుకున్నారు. త్రీటైర్‌లో దాదాపు 100 మంది నిరీక్షణలో ఉన్నారు. నారాయణాద్రి, సింహపురిలోనూ నిరీక్షణ జాబితా చాంతాడులా ఉంది.
ఇదీ చదవండి: