రైతుల పేరిట భూములు ఉన్నట్లు రికార్డు చేయండి... లేకపోతే కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తా... ఈ మాట చెప్పింది ప్రతిపక్ష ఎమ్మెల్యే కాదు... అధికార పార్టీకి చెందిన శాసనసభ్యుడే. గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు... బొల్లాపల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో రెవిన్యూ అధికారుల తీరుపై ఆవేదనగా మాట్లాడారు. బొల్లాపల్లి మండలంలో 600 మంది రైతుల భూములకు సర్వే నెంబర్లు ఆన్‌లైన్ చేయకపోవడంపై ఎమ్మెల్యే అధికారులను నిలదీశారు. రైతులకు న్యాయం చేయలేని పదవులు, ఉద్యోగాలు అనవసరమని వ్యాఖ్యానించారు. అధికారులు పని చేయకపోతే కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరించారు.
ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వ్యాఖ్యలపై తహసీల్దార్ బాలకృష్ణ అంతే ఘాటుగా స్పందించారు. నిబంధనల ప్రకారమే తాము నడుచుకుంటున్నామని స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా తాను 10సార్లు ఉత్తమ అధికారిగా అవార్డు తీసుకున్నానని... వేర్వేరు పనులు చేసి తహశీల్దార్‌గా రాలేదని సమాధానమిచ్చారు. దీంతో ఎమ్మెల్యే సహా... అక్కడున్న ఉన్నతాధికారులు, ప్రజలు నివ్వెరపోయారు. ఇక్కడి వారికి ఇష్టం లేకపోతే వెళ్ళిపోతానని... ఉన్నతాధికారుల సమక్షంలోనే తహసీల్దార్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. వేదికపై ఉన్న అదనపు జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ జోక్యం చేసుకుని... రైతుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండీ...