NTR centenary celebrations: ఎన్టీఆర్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశరాజకీయాల్లోనే పెను విప్లవం సృష్టించిన వ్యక్తి అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ నటులు మురళీమోహన్, సీనియర్ నటి జయచిత్రకు ఎన్టీఆర్ అవార్డు అందజేశారు. కార్యక్రమంలో మాట్లాడిన వెంకయ్యనాయుడు.., అటు సినీరంగంలో ఇటు రాజకీయరంగంలో ఎన్టీఆర్‌కు ఎవ్వరూ సాటిలేరన్నారు. బడుగు, బలహీనవర్గాలకు, మహిళలకు రాజకీయాల్లో పెద్ద పీట వేసి వారి అభ్యున్నతికి పాటుపడ్డారని తెలిపారు.
ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీ నాయకుడైనా దృఢమైన జాతీయవాది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని జాతీయవాదంతో సమ్మిళితం చేశారు. ఎన్టీఆర్ వ్యక్తిత్వం చూసి రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆయన్ను గౌరవించేవారు. రాజకీయ నాయకులు నిత్యం ప్రజలతో ఉండాలని.. అప్పుడే వారి కష్టనష్టాలు తీర్చడం సాధ్యమవుతుంది. ఉచిత పథకాలు అన్నివేళలా శ్రేయస్కరం కాదు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు స్వయం శక్తితో ఎదిగేలా చూడాలి. -వెంకయ్యనాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి
మాజీ మంత్రి ఆలపాటి రాజా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమార్తె లోకేశ్వరి, కుమారుడు రామకృష్ణతోపాటు టీడీపీ సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నక్కా ఆనంద్‌బాబు, నన్నపనేని రాజకుమారి పాల్గొన్నారు.
యడ్లపాటి వెంకట్రావు నివాసానికి: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. అనంతరం మాజీ రాజ్యసభ సభ్యులు యడ్లపాటి వెంకట్రావు నివాసానికి వెళ్లారు. వెంకట్రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వెంకయ్యనాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధా రాణి పాల్గొన్నారు. తెలుగుదనానికి ఎన్టీఆర్ నిలువెత్తు నిదర్శనం అన్నారు. రచయిత సురేష్ రాసిన మహాత్మాగాంధీ పుస్తకం, రూపొందించిన డాక్యుమెంటరీని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జస్టిస్ రాధా రాణి.. తన పుట్టినిల్లు తెనాలికి రావటం సంతోషంగా ఉందన్నారు. తెనాలితో తన అనుబంధం గుర్తు చేసుకున్నారు. గాంధీ పొట్టివాడని, చొక్కా లేదని విన్ స్టన్ చర్చిల్ గేలి చేశారని.. తన వ్యక్తిత్వంతో, నాయకత్వంతో గాంధీ వాటిని అధిగమించారని గుర్తు చేశారు. స్వతంత్ర పోరాటంలో లక్షలాది మందిని ముందుండి నడిపించారని, మహిళలను పోరాటంలోకి వచ్చేలా చేశారని వివరించారు.
పెమ్మసాని థియేటర్లో ఎన్టీఆర్ నటించిన మా దైవం సినిమా: శతాబ్ది ఉత్సవాలకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధా రాణి, సినీనటుడు మురళీ మోహన్, అలనాటి నటి జయచిత్ర అంతా కలిసి.. పెమ్మసాని థియేటర్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పెమ్మసాని థియేటర్లో ఎన్టీఆర్ నటించిన మా దైవం సినిమాని తిలకించారు. ఎన్టీఆర్ కుమార్తె గారపాటి లోకేశ్వరి, ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెమ్మసాని థియేటర్ కి వచ్చిన ప్రముఖులకు ఎన్టీఆర్ శతజయంతి కమిటీ నిర్వాహకులు సన్మానించారు.
ఇవీ చదవండి: