వైద్యారోగ్య, అంగన్వాడీ సిబ్బందికి గుంటూరు జిల్లాలో జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఇది ఇంకా పూర్తికాలేదు. ఈ నెల 24 నాటికి 74.34 శాతం మంది మాత్రమే టీకాలు వేయించుకున్నారు. ఫిబ్రవరి 1న ఫ్రంట్ లైన్ వర్కర్లు, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ఉద్యోగులకు టీకా పంపిణీ ప్రారంభం కాగా.. ఇప్పటివరకు 84.53 శాతం మంది ఉద్యోగులు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వర్కర్లు 100 శాతం టీకాలు వేసుకోవాలని కలెక్టర్ ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో మందలించారు. ఆయా విభాగాల అధిపతులు ఇందుకు బాధ్యత వహించాలని సూచించారు.
కొవిడ్ ఉద్ధృతంగా వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్ నివారణ, నియంత్రణలో వైద్యారోగ్య శాఖ, పోలీస్, పంచాయతీరాజ్, పురపాలక శాఖ ఉద్యోగుల పాత్ర కీలకమైనది. మార్చి 1న 60 ఏళ్లు నిండినవారికి వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా.. ఇప్పటివరకు 1,37,420 మందికి టీకాలు వేశారు. ఇక 45-59 ఏళ్ల మధ్య 1,45,903 మంది టీకా పుచ్చుకున్నారు. మొత్తం మీద మూడు విభాగాల్లో కలిపి ఈనెల 24 నాటికి మొదటిడోసు 3,81,132 మందికి, రెండో డోసు 92,333 మందికి వేశారు. 45 ఏళ్లు దాటిన వారు జిల్లాలో సుమారు 12 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. వీరిలో కనీసం 10 శాతం మంది మాత్రమే టీకా తీసుకున్నారు. ఇంకా లక్ష్యం చాలా దూరంలో ఉంది. ఏప్రిల్ 14న జిల్లాలో 54,067 మందికి వ్యాక్సినేషన్ నిర్వహించారు. ఆ రోజు తప్ప మిగతా రోజుల్లో ఎక్కడా టీకా కార్యక్రమం పూర్తిస్థాయిలో సాగలేదు. డిమాండ్, సరఫరా మధ్య అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో.. తగనన్ని వ్యాక్సిన్లు సరఫరా కాక వైద్యారోగ్య శాఖ అధికారుల ప్రణాళికకు అవాంతరం ఏర్పడింది. చాలామంది వ్యాక్సిన్లు వేసుకుందామని ఆరోగ్యకేంద్రాలకు వెళ్లినా నిరాశతో వెనుదిరిగిన సందర్భాలు ఎదురయ్యాయి. కరోనా కేసులు ఉద్ధృతం కావడంతో వ్యాక్సిన్లకు డిమాండ్ ఒక్కసారిగా ఏర్పడింది. వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో.. ఏ కేంద్రంలో వేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. మే ఒకటి నుంచి 18 ఏళ్లు నిండినవారందరికీ వ్యాక్సిన్లు ఇస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఒక్కసారిగా లక్షల్లో పెరిగే వ్యాక్సిన్ డిమాండ్‌ను ఎలా చేరుకుంటారోనన్నది మాత్రం సందేహాస్పదంగానే ఉంది.
ఇదీ చదవండి: 'హైకోర్టు చెప్పింది నిజమే.. పాపం ఈసీదే!'
ఇచ్చిన వ్యాక్సిన్లను నిర్ణీత సమయంలోనే పూర్తి చేశామని జిల్లా అధికారులు చెబుతున్నారు. అర్హులై ఉండి టీకాలు వేసుకోనివారిని గుర్తించి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆయా శాఖల విభాగాధిపతులకు సూచించామంటున్నారు. వాలంటీర్లు ప్రధానంగా వ్యాక్సినేషన్ ప్రక్రియకు ముందుకు రావాలని జాయింట్ కలెక్టర్ ప్రశాంతి పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: రేపల్లే సీహెచ్‌సీలో కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు: మోపిదేవి