వేల కిలోమీటర్ల ప్రయాణం, తమ సంతతి పెంపు కోసం ఆరాటం, ప్రకృతితో మమేకమై జీవనం, ప్రజలకు మనోల్లాసం కలిగించే ప్రవర్తన... ఇలా ఎన్నో వైవిధ్యమైన అంశాల కలబోతే సైబీరియన్ పక్షులు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు గ్రామంలోని పక్షుల సంరక్షణ కేంద్రంలో విభిన్నమైన విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. శీతల దేశాల నుంచి వచ్చి సంతానోత్పత్తి చేసుకుని తిరిగుపయనమవుతున్నాయి.
మొదట పదుల సంఖ్యలోనే...
ఉప్పలపాడు గ్రామానికి 50 ఏళ్ల క్రితమే ఈ విదేశీ పక్షుల రాక మొదలైంది. మొదట పదుల సంఖ్యలో వచ్చిన వలస పక్షులు... ప్రస్తుతం వేల సంఖ్యలో వస్తున్నాయి. దాదాపు పదెకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు మధ్యలో ఉన్న చెట్లపై ఇవి గూళ్లు కట్టుకుని నివసిస్తున్నాయి. సైబీరియా, రష్యా, ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ వంటి దేశాల నుంచి పక్షులు వలస వచ్చి, సంతానోత్పత్తి చేసుకుని తిరుగుపయనమవుతున్నాయి.
వివిధ రకాలు...
తెల్లకొంగ, ఎర్ర కాళ్ల కొంగ, చుక్కల ముగ్గు బాతు, పెదవిముక్కు కొంగ, నల్లతల కంకణం, పాముబాతు, చిన్ననీటి కాకి, కందురెక్కల బదాని, దోసికొంగ, మునుగుడి కోడి, తెల్లబొర్ర నీటి కోడి, జంబుకోడి, నల్లబౌలి కోడి ఇలా వివిధ రకాల పక్షులు ఇక్కడికి వచ్చే వాటి జాబితాలో ఉన్నాయి.
ఏటా వలస పక్షుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడకు వచ్చే సందర్శకుల కోసం వాచ్ టవర్ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. గుంటూరుకు సమీపంలోనే ఉండటంతో పర్యాటకంగా అభివృద్ధికి మంచి అవకాశాలున్నాయని గ్రామస్థులు, అధికారులు తెలిపారు.
ఇదీచదవండి.