High Temperatures in ap: వేసవి కాలం సీజన్ ఆరంభంలోనే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తీవ్రస్థాయి ఉష్ణోగ్రతల కారణంగా రాష్ట్రంలోని కొన్ని మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణా సంస్థ వెల్లడించింది. మరోవైపు ఉష్ణగాలుల కారణంగా సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్టు వాతావరణశాఖ తెలియచేసింది. ప్రత్యేకించి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు స్పష్టం చేసింది. ఏపీలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా సింగడాంలో 41.34 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. ప్రకాశం జిల్లాలోని జరుగుమిల్లిలో 40.59 డిగ్రీలు అనకాపల్లిలో 40.28 డిగ్రీలు, విజయనగరం పూసపాటిరేగలో, నెల్లూరు జిల్లా కందుకూరులో 40.27, నంద్యాల జిల్లా గోస్పాడు లో 40.24 డిగ్రీలు, పల్నాడులో, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో 39.75 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైంది. కడప, అల్లూరి జిల్లా, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లా, అనంతపురం, కోనసీమ, ఏలూరు తదితర ప్రాంతాల్లో 39 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది. ఇక పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, తాడేపల్లి గూడెం, గుంటూరుల లో 38 డిగ్రీలు, బాపట్ల, డిగ్రీలు, తిరుపతిలో 34 డిగ్రీలు, సత్యసాయి జిల్లా కదిరి, కృష్ణా జిల్లా నందివాడలో 37 డిగ్రీలు చొప్పున ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
గుంటూరులో మండుతున్న ఎండలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎండల నేపథ్యంలో ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే బయపడుతున్నారు. స్కూల్కు వెళ్లే విద్యార్ధులు ఎండ వేడికి ఇబ్బందులు పడుతూ ఇంటికి చేరుకుంటున్నారు. వాహనాలపై వెళ్లే ప్రయాణికులు సైతం చెట్ల నీడ కింద ఆగి మరీ సేద తీర్చుకుంటున్నారు. కొద్దిరోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో బయటకి వచ్చినా శీతల పానియాలు తాగేందుకు, ఏసీలలో ఉండేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. వేసవి తాపం నుంచి కాపాడుకునే క్రమంలో ప్రజలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలతో విద్యుత్ వినియోగం పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.
రోహిణి కార్తీలో ఎండలకు రోళ్లు పగులుతాయంటారు. కానీ కర్నూలు జిల్లా గోనెగండ్లలో ఏప్రిల్ నెలలోనే ఎండలు అధికమై బండ రాయి పగలడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలోని నరసప్ప దేవాలయం వద్ద ఉన్న పెద్ద బండరాయి ఎండలకు ఆదివారం పెద్ద శబ్దం చేస్తూ పగిలింది. దీంతో అక్కడ ఇళ్లల్లో ఉన్న ప్రజలు ఆందోళనకు గురయ్యారు. పగిలి బండరాయిపై మరో బండరాయి ఉండటంతో ఎక్కడ పడిపోతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఇవీ చదవండి: