Kishan Reddy on Buying TRS MLAs Issue: ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ఇష్టానుసారంగా తెరాసలో చేర్చుకున్నప్పుడు కేసీఆర్‌కు ఫిరాయింపుల గురించి గుర్తుకు రాలేదా అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలుకు యత్నించారని చేస్తున్న ఆరోపణలపై కేసులు పెట్టాల్సి వస్తే ముందు కేసీఆర్ కుటుంబంపైనే పెట్టాలని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలపై సిట్టింగ్ న్యాయమూర్తి, సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రూ.100 కోట్లతో నలుగురు ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం లేదు అన్న ఆయన.. మాకేం భయం లేదు.. మాది తెరిచిన పుస్తకమని కిషన్‌రెడ్డి అన్నారు.
'రాష్ట్రంలో భాజపా వస్తుందనే భయంతో డ్రామాలు చేస్తున్నారు. రూ.100 కోట్లు అన్నారు... ఇప్పుడు రూ.15 కోట్లు అంటున్నారు. ఫిరాయింపులకు ప్రోత్సహించింది కేసీఆరే. మాయ మాటలతో ప్రజలను మభ్య పెడుతున్నారు. మీలాగా భాజపా దగ్గర అంత డబ్బు లేదు. డబ్బులు ఉన్నాయి కాబట్టే కేసీఆర్ విమానం కొన్నారు. అన్ని సర్వేలు తెరాస ఓడిపోతుందని చెబుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కుటుంబపాలనను గద్దె దించుతాం. ప్రస్తుత వ్యవహారంతో మాకు ఎలాంటి సంబంధం లేదు. తెరాస వద్ద నీతులు నేర్చుకోవాల్సిన అవసరం భాజపాకు లేదు.'-కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
ఓడిపోతామనే భయంతోనే డ్రామాలు చేస్తున్నారు.. తెలంగాణలో భాజపా వస్తుందనే భయంతో కట్టుకథలు చెబుతున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. తాము హార్స్ ట్రేడింగ్ చేస్తున్నామని ప్రచారం చేశారన్నారు. భాజపాలో చేరడం అంటే రాజ్యాంగ విరుద్ధమైనట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. నలుగురు ఎమ్మెల్యేలు తమకు అవసరమే లేదు అన్న కిషన్‌రెడ్డి.. మాయ మాటలతో డ్రామా సృష్టించి ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నించారని వ్యాఖ్యానించారు. అన్ని సర్వేలు తెరాస ఓడిపోతుందని చెబుతున్నాయన్నారు. ఓడిపోతామనే భయంతోనే డ్రామాలు చేస్తున్నారని పేర్కొన్న ఆయన... ఎట్టి పరిస్థితుల్లో కుటుంబపాలనను గద్దె దించుతామని సవాల్ విసిరారు. ఇలాంటి స్క్రీన్‌ప్లేలకు భయపడేది లేదని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.
ఇవీ చదవండి: