కృత్రిమ కాలుతో.. డ్రైవింగ్ లైసెన్సు కూడా లేకుండా అతివేగంగా కారు నడిపిన ఓ యువకుడు.. డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా కాకుమాను మండలం రేటూరుకు చెందిన పఠాన్ జాఫర్ సాదిక్ (18) రెండు రోజుల కిందట బంధువుల వివాహం నిమిత్తం తెలిసిన వారి కారులో గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం వచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం అదే గ్రామానికి చెందిన అతని స్నేహితులు బేగ్ ఖాదర్ నాగూర్ బాషా(15), పఠాన్ లాలు (19)తో కలిసి కారులో వెంగళాయపాలెం నుంచి చిలకలూరిపేట జాతీయ రహదారి వైపు వెళ్తున్నారు.
గతంలో జరిగిన ఓ ప్రమాదంలో పఠాన్ లాలు కాలు కోల్పోయాడు. కృత్రిమ కాలుతోనే కారు నడిపాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వేగంగా వెళ్తున్న కారు.. వెంగళాయపాలెం సమీపంలో ఎదురుగా వచ్చిన ఆటోను, పక్కనే వెళుతున్న వ్యక్తిని తప్పించబోయి డివైడర్‌ను, ఆ పక్కనే ఉన్న విగ్రహాన్ని బలంగా ఢీకొట్టింది. ఘటనా స్థలిలోనే జాఫర్ సాదిక్, నాగూర్ బాషా మరణించారు. పఠాన్ లాలు తీవ్ర గాయాలతో గుంటూరు సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి.