వైకాపా తరఫున బరిలో ఉన్న అన్నాబత్తుని శివకుమార్... కిందటి ఎన్నికల్లో ఓడిపోయారు. రెండోసారి అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. ఇప్పటికే పాదయాత్ర, గడప గడపకు వైకాపా పేరుతో నియోజకవర్గాన్ని చుట్టేశారు. ఈయన దూకుడు స్వభావం పార్టీ శ్రేణులకే నచ్చడం లేదన్న అపవాదు ఉంది. శివకుమార్ మాత్రం విజయంపై గట్టి ధీమాతో ఉన్నారు. గెలిస్తే తెనాలిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు.
ఇక్కడ జనసేన అభ్యర్థిగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బరిలోకి దిగారు. తెదేపా- వైకాపా అభ్యర్థులతో సమానమైన ఇమేజ్ ఉంది. స్పీకర్గా చేయడంతో రాష్ట్రస్థాయి నేతగా గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచే రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయినప్పటికీ ఈయన మాత్రం గణనీయమైన ఓట్లే సాధించారు. ఇది ఆయనకు కాస్త సానుకూలాంశం అవుతుందని పార్టీ భావిస్తోంది. ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు చేసిన అభివృద్ధి, జనసేన ఎన్నికల ప్రణాళిక, ప్రజల్లో అధినేతకు తనకూ ఉన్న పేరు కలిసొస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు.
తెనాలి నియోజకవర్గంలో మొత్తం 2లక్షల 35వేల మంది ఓటర్లున్నారు. రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతం కావటంతో..గెలుపుకోసం ముగ్గురూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోరులో ఉన్న 3 పార్టీల అభ్యర్థులూ ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావటం పోరును మరింత రసవత్తరంగా మార్చేసింది.