గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎస్సీ శ్మశానవాటికలో క్రైస్తవ సమాధుల తొలగింపునకు సంబంధించి పురపాలక సంఘం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రభుత్వానిదే బాధ్యత అంటూ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తెదేపా నేతలు కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు నేతృత్వంలో పార్టీ నిజనిర్ధరణ కమిటీ వేసింది. ఇదే సమయంలో.. అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. పురపాలక కమిషనర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జరిగిన సంఘటనకు క్షమాపణ చెప్పారు.
చిలకలూరిపేట ఎస్టీ శ్మశానవాటికలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ. 1.21 కోట్లు మంజూరు చేసిందని కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. అందులో భాగంగా దహన వాటిక నిర్మించేందుకు గుత్తేదారు పనులు ప్రారంభించారన్నారు. ఈ క్రమంలోనే శ్మశాన వాటికలో పొరపాటున 10 నుంచి 15 సమాధులు తొలగించామని చెప్పారు. ఈ విషయంలో దళితుల మనోభావాలు దెబ్బ తిని ఉంటే క్షమించాలని కమిషనర్ కోరారు. జరిగిన సంఘటనకు సంబంధించి డిమాండ్ల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.