దేశంలో ప్రతి కుటుంబానికి ఆవాసం కల్పించాలనే లక్ష్యంతో 2015 నుంచి 2022 వరకూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంతో అందరికీ ఇళ్లు కార్యక్రమం మొదలు పెట్టారు. నగరాలు, పట్టణాల్లోని మురికివాడల్లో నివసించే పేదలతో పాటు సొంతిళ్లు లేనివారికి సౌకర్యాలతో కూడిన బహుళ అంతస్థుల భవనాలు నిర్మించి ఇవ్వాలనేది పథకం లక్ష్యం.
పట్టణ మౌళిక వసతుల అభివృద్ధి సంస్థ - టిడ్కో ఆధ్వర్యంలో నిర్మాణాలు చేపట్టారు. గుంటూరు నగరంతో పాటు జిల్లాలోని మున్సిపాలిటీలు, సీఆర్డియే పరిధిలో 51 వేల 412 ఇళ్లను మంజూరయ్యాయి. కేంద్రం ఇచ్చే లక్షన్నరకు రాష్ట్రప్రభుత్వం మరో లక్షన్నర రూపాయలు కలిపి రాయితీగా అందించి మిగతా సొమ్ముని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేలా పథకాన్ని రూపొందించారు.
2015 నుంచి 2019 వరకూ 4 విడతల్లో మంజూరైన ఇళ్లను జీ ప్లస్ 3 విధానంలో నిర్మాణాలు ప్రారంభించి కొన్ని పూర్తి చేశారు. లబ్ధిదారులను ఎంపిక చేసి ప్లాట్లు కేటాయించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయినా... మౌలిక వసతుల కల్పనలో జాప్యం జరుగుతోంది. ప్రధానంగా తాగునీరు, డ్రైనేజి వ్యవస్థ ఏర్పాటు పనులు ఆగిపోయాయి. గుంటూరు నగరంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియలో సాంకేతిక అడ్డంకులు ఏర్పడటంతో బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు కాలేదు. మిగిలిన మున్సిపాలిటిల్లో కొన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా చిన్నచిన్న పనులు మిగిలిపోవటంతో లబ్ధిదారులకు అప్పగించలేని పరిస్థితి.
రాష్ట్రంలో 2019లో ప్రభుత్వం మారటంతో ఎక్కడికక్కడే పనులు నిలిచిపోయాయి. కొన్నిచోట్ల నిర్మాణాలకు నిర్వహణ లేక దెబ్బతింటున్నాయి. వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణాలు చేసినా అర్థాంతరంగా ఆపేయటంతో లక్ష్యం నీరుగారిపోయింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావటంతో మౌళిక వసతుల కల్పన పనులు ఆగిపోయాయి. ప్రాజెక్టుని పూర్తి చేయాల్సిన గుత్తేదారు కంపెనీలకు బిల్లులు చెల్లించకపోవటంతో పనులు నిలిపివేశారు.
భవనాల నిర్మాణంలో కొంతమేర అంతర్గత సిమెంటు రోడ్లు, మురుగునీటి పారుదల పనులు చేయాల్సి ఉంది. గుత్తేదారులు సైతం టిడ్కో ఇంజినీరింగ్ విభాగానికి బిల్లుల చెల్లించాలని లేఖలు రాస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో సందిగ్దత కొనసాగుతోంది. ఈ సమస్యలన్నీ పరిష్కారమైతేనే మౌళిక వసతుల కల్పన పూర్తవుతుంది.
సొంతింటి కల నెరవేరుతుందనే లబ్దిదారుల ఆశలు అడియాసలే అయ్యాయి. ఇంకా ఎన్నాళ్లీ ఎదురు చూపులని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లబ్దిదారుని వాటా చెల్లించటానికి అప్పులు చేసినవారు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇంటి అద్దెలు, ఇంకో వైపు కొత్త ఇళ్లు ఎప్పుడిస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో ఇప్పటి వరకూ 32 వేల 192 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించగా... అందులో 14 వేల 504 పూర్తయ్యాయి. 24 వేల 494 ఇళ్లు శ్లాబు దశలో ఉన్నాయి. లబ్ధిదారులకు 36 వేల 592 ప్లాట్లు కేటాయించాల్సి ఉండగా... ఇప్పటి వరకూ 22 వేల 675 కేటాయించారు. ఇంకా 13 వేల 917 కేటాయించాల్సి ఉంది. అలాగే 36 వేల 592 మంది బ్యాంకు ఖాతాలు తెరవాల్సి ఉంది. ఇప్పటి వరకూ 2 వేల 779 మందికి 93 కోట్ల 13 లక్షల రూపాయలను బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. లబ్ధిదారులంతా ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరవటంతో పాటు వాటిని పథకానికి అనుసంధానించి రుణాలు మంజూరు చేయాల్సి ఉంది.
ఇదీ చదవండి:
విశ్వవిద్యాలయంలో వనం... 10 ఎకరాల్లో లక్షకు పైగా మొక్కల పెంపకం