నకిలీ ఐడీలతో రైల్వే టిక్కెట్లు బుక్ చేసి విక్రయిస్తున్న వారి గుట్టును గుంటూరు రైల్వే పోలీసులు రట్టు చేశారు. గుంటూరు నుంచి భారీ సంఖ్యలో నకిలీ ఐడీలతో ఐఆర్‌సీటీ ద్వారా రైల్వే టిక్కెట్లు బుక్ చేస్తున్నట్లు రైల్వే డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ (డీఎస్‌సి) కె.సత్యహరప్రసాద్, గుంటూరు రైల్వే సీఐ ఫిరోజ్‌కుమార్‌లకు సమాచారం వచ్చింది. దీంతో టిక్కెట్లు బుక్ చేస్తున్న వారిపై నిఘా పెట్టారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి దర్యాప్తు చేయగా గుంటూరు అరండల్‌పేటకు చెందిన ఎం.షణ్ముక సత్యం, తాడేపల్లి మండలం నులకపేటకు చెందిన లూర్దురాజులు వారి నివాసాల నుంచి అధికంగా టిక్కెట్లు బుక్ చేస్తున్నట్లు తెలుసుకున్నారు. రైల్వే పోలీసులు వెళ్లి వారి నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు.
షణ్ముక, లూర్దురాజులు తమ వ్యక్తిగత ఐడీలతోపాటు బంధువులు, స్నేహితులు, తెలిసిన వ్యక్తుల పేర్లతో నకిలీ ఐడీలు తెరిచి వాటి నుంచి పెద్దమొత్తంలో టిక్కెట్లు బుక్ చేసి విక్రయిస్తున్నట్లు తెలుసుకున్నారు. షణ్ముక సత్యం గత రెండేళ్లుగా, లూర్దురాజు ఏడాదిగా ఇలా నకిలీ ఐడీలతో టిక్కెట్లు విక్రయిస్తున్నట్లు తేలిందని సీఐ ఫిరోజ్‌కుమార్ తెలిపారు. తనిఖీలు చేసిన సమయంలో షణ్ముక వద్ద రూ.47 వేల విలువ చేసే టిక్కెట్లు, లూర్దురాజు వద్ద రూ.33 వేల విలువ చేసే టిక్కెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిద్దరినీ గురువారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచినట్లు సీఐ తెలిపారు. వ్యక్తిగత ఐడీ నుంచి కాకుండా ఇతరుల ఐడీలతో టిక్కెట్లు బుక్ చేయడం నేరమని ఆయన చెప్పారు. రైల్వేశాఖ నుంచి అనుమతులు తీసుకోకుండా నకిలీ ఐడీల నుంచి రైల్వే టిక్కెట్లు బుక్ చేసినా, విక్రయించినా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చూడండి.