Honey Trap: గుంటూరు జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు (60) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల కిందట భార్య మృతి చెందారు. వారి ఇద్దరు పిల్లలు పెళ్లి చేసుకొని వెళ్లిపోయారు. షుగర్‌తో బాధ పడుతున్న అతను తన ఆలనపాలన చూసుకోడానికి ఒక మహిళ తోడు ఉంటే బాగుంటుందనుకున్నారు. పత్రికలో వివాహాల మధ్యవర్తి ఫోన్ నంబర్‌కు కాల్ చేసి మాట్లాడారు. అటువైపు నుంచి ముందుగా తన ఖాతాలో రూ. 3 వేలు జమ చేయాలని కోరింది. ఖాతాకు రూ. 3 వేలు జమ చేసిన తర్వాత ఆమె ఓ ఫోన్ నంబర్ ఇచ్చింది. ఆ నంబర్‌కు అతను ఫోన్ చేశారు.
అలా మాటలు కలిపిన ఆమె అతనితో కలసి జీవించటానికి సుముఖంగా ఉన్నట్లు ఏమార్చింది. కొద్దిరోజులకు తనకు రూ. లక్ష అవసరం ఉందని, నగదు ఇవ్వాలని కోరింది. తన వద్ద డబ్బులు లేవని అతను సున్నితంగా చెప్పాడు. అప్పటి నుంచి అతనితో ఆమె ఫోన్ మాట్లాడటం లేదు. రెండు రోజుల తర్వాత మరో మహిళ అతనికి ఫోన్ చేసింది. జంగారెడ్డిగూడెం నుంచి మాట్లాడుతున్నానని, తనకు ఎవరూ లేరని చెప్పింది. తనకు చాలా ఆస్తి ఉందని, తాను కూడా తోడు కావాలని కోరుకుంటున్నట్లు నమ్మించింది.
కొద్దిరోజుల తర్వాత కుటుంబ అవసరాలకు రూ.లక్ష ఇస్తే వెంటనే తిరిగి ఇచ్చేస్తానని ప్రేమగా కోరింది. ఆమె మాటలకు ఫిదా అయి రూ.లక్ష ఆమె ఖాతాలో వేశారు. అప్పటి నుంచి ఆమె ఫోన్ తీయడం లేదు. కొద్దిరోజులకు భీమవరం నుంచి ఓ మహిళ ఫోన్ చేసింది. వివాహాల మధ్యవర్తి నుంచి నెంబర్ తీసుకున్నానని తెలిపింది. అప్పటికే ఇద్దరు మస్కా కొట్టడంతో కోపంగా ఉన్న వృద్ధుడు ఆమె మాటలు నమ్మశక్యం కాక కొద్దిరోజులు పట్టించుకోలేదు. అయినా ఆమె పదేపదే ఫోన్ చేయడంతో ఒకరోజు మాట్లాడారు. ఇదే తరహాలో తనను మహిళలు మోసగించారని ఆమెకు చెప్పారు. తాను అలాంటి దానిని కాదని, తనకు 35 సంవత్సరాలకే పెళ్లయ్యిందని తెలిపింది. భర్తలో మగతనం లేక, పిల్లలు పుట్టక విడాకులు ఇచ్చానని చెప్పింది. తల్లిదండ్రులు లేని తాను ప్రస్తుతం అన్నయ్య వద్ద ఉంటున్నానని, అతను తాగివచ్చి కొడుతున్నాడని ఫోన్‌లో ఏడ్చింది. అమ్మమ్మ ఇచ్చిన రూ. కోట్ల ఆస్తి ఉందని, వేరే వారిని మోసం చేసి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం తనకు లేదంటూ మస్కా కొట్టింది.
ఆమె తియ్యటి మాటలకు అతను తెలియకుండానే మాయలో పడిపోయాడు. తన వయస్సు, భార్య చనిపోయిన విషయం, కుటుంబ పరిస్థితులు చెబితే... అన్నింటికీ సమ్మతమేనని ఆమె తెలిపింది. వివాహం చేసుకుంటానని మాయ చేసింది. కొద్దిరోజులు ఛాటింగ్ చేసింది. వీడియో కాల్ చేయమని కోరింది. ఎలా వీడియోకాల్ మాట్లాడాలో ఓ లింకు పంపించి క్లిక్ చేయమంది. అతనిది స్మార్టుఫోన్ కాకపోవడంతో మిన్నకుండిపోయాడు. కొద్దిరోజుల తర్వాత తన అమ్మమ్మ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయడానికి రూ. లక్ష కావాల్సి వచ్చిందని, నగదు ఇస్తే వారంలో తిరిగి ఇచ్చేస్తానని చెప్పింది. ఆమె మాటలు నమ్మిన అతను, తన భార్యకు చెందిన బంగారం వస్తువులు బ్యాంకులో కుదవపెట్టి డబ్బులు దగ్గర పెట్టుకున్నారు. బ్యాంకు ఖాతాలో వేస్తే మోసగిస్తున్నారని ఆమెను నేరుగా కలవాలని అనుకున్నట్లు తెలిపారు. దీంతో ఆ మహిళ తాను బస్సులో వస్తున్నానని, బస్టాండ్‌కు వచ్చి రిసీవ్ చేసుకోవాలని కోరింది. అక్కడ నుంచి ఇద్దరం ఇంటికి వెళదామని చెప్పింది. ఆమె చెప్పినట్లు బస్టాండ్‌కు వెళ్లగానే రిజిస్ట్రేషన్‌కు సమయం అవుతోందని, ముందు డబ్బులు ఇస్తే కట్టేసి వచ్చేస్తానంటూ చెప్పింది. నగదు తీసుకొని మాయమైంది. అప్పటి నుంచి ఆమెకు ఫోన్ చేస్తే స్పందించడం లేదు.
ఇవీ చదవండి: