Tragedy at Uyyur Program in Guntur: ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కానుకల పంపిణీ తొక్కిసలాటలో ముగ్గురు పేద మహిళలు మృతి చెందటం తీవ్ర విచారకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. నిరుపేదలకు కానుకలు అందించే ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నానని.. తాను వెళ్లిన తరువాత జరిగిన ఈ ఘటన కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు.. బాధిత కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు స్పష్టం చేశారు. గుంటూరు పశ్చిమ ఇంఛార్జ్ కోవెలమూడి రవీంద్ర 2లక్షలు, టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ లక్ష చొప్పున సాయం అందిస్తామని ప్రకటించారు..
తొక్కిసలాట దుర్ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2లక్షల చొప్పున, గాయపడినవారికి 50వేల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. తొక్కిసలాట ప్రమాదంలోముగ్గురు మృతి చెందడం, పలువురు గాయపడటంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో మృతుల కుటుంబసభ్యుల్ని, క్షతగాత్రుల్ని మంత్రి విడదల రజని పరామర్శించారు. ఈ ఘటనకు టీడీపీ అధినేత చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు.
కానుకల పంపిణీలో ప్రమాదానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి కార్యక్రమానికి భద్రత ఏర్పాటు ప్రభుత్వ బాధ్యత కాదా అని ప్రశ్నించారు. ఘటన జరిగిన వెంటనే మంత్రులు, వైసీపీ సామాజిక మాధ్యమ విభాగం తప్పుడు ప్రచారానికి తెర లేపడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆసుపత్రిలో బాధితుల్ని పరామర్శించిన తెలుగుదేశం నేతలు.. నిరుపేదలు చనిపోతే మంత్రులు రాజకీయాలు చేయడం సరికాదని మండిపడ్డారు. తొక్కిసలాట ఘటనలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తోందని సీపీఎం రాష్ట్ర కమిటీ ఆరోపించింది. ముగ్గురు నిరుపేదలు చనిపోవడంపై విచారం వ్యక్తం చేసింది..
ఇవీ చదవండి: