కొవిడ్-19 భయంతో చాలామంది దూరప్రాంతాలకు ద్విచక్రవాహనాల మీద ప్రయాణం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి తెలియకుండానే ప్రమాదానికి గురై చాలా మంది మృత్యువాతపడుతున్నారు. అలాంటి ఘటన గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో మహిళ చికిత్స పొందుతూ మరణించారు.
ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీమాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో అన్నదానం రవికుమార్(48) గత కొంతకాలంగా ప్రధాన వేదపండితులుగా పని చేస్తున్నారు. గుంటూరు నగరం కంకరగుంట ప్రాంతంలో నివాసముంటున్న రవికుమార్... శనివారం మాత్రమే దర్శనం ఉండే ఈ దేవాలయానికి ప్రతి శుక్రవారం ద్విచక్రవాహనంపై వెళ్లి వస్తుంటాడు. అదే క్రమంలో గుంటూరు నుంచి మాలకొండ వెళ్తున్నారు. ఆ సమయంలోనే మరో ద్విచక్రవాహనంపై ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం మక్కెన వారిపాలెం గ్రామానికి చెందిన నంబూరి నాగరాజు(32), అతని భార్య కల్యాణి, అక్క కూతురు శ్రావణి విజయవాడ నుంచి గ్రామానికి వస్తున్నారు.
టైరు పేలి...కారు అదుప్పి..
ఒంగోలుకు చెందిన శివకృష్ణ కారులో విజయవాడ నుంచి వస్తున్నాడు. జాతీయ రహదారిపై యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద ఒక్కసారిగా కారు టైరు పగిలి అదుపుతప్పి... ముందు వెళ్తున్న రెండు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వేద పండితుడు రవికుమార్, నాగరాజులు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన కల్యాణి ,శ్రావణిలను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కల్యాణి కూడా చనిపోయారు. చిలకలూరిపేట గ్రామీణ సీఐ సుబ్బారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:
ట్యూషన్ టీచర్ నిర్వాకం.. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కరోనా