నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరండల్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. గూడూరు రాము, గూడూరు మస్తానయ్య, దుర్గాప్రసాద్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ సుప్రజ తెలిపారు.
రైల్వే ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి...
గుంటూరు అమరావతి రోడ్డులో నివాసం ఉంటున్న ఉల్లం ఆనంద్ కుమార్ బీటెక్ పూర్తి చేసి.. ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నాడు. ఈ క్రమంలో గూడూరు రాము, గూడూరు మస్తానయ్య, ఆలపాటి దుర్గ ప్రసాద్ అనే ముగ్గురు వ్యక్తులు వారి కుటుంబంతో పరిచయం ఏర్పరుచుకున్నారు. తాము బాపట్ల, నరసరావుపేటలో సబ్ కలెక్టర్, సబ్ రిజిస్ట్రార్లుగా పని చేస్తున్నామని.. రైల్వే ఉద్యోగులు అందరూ తెలుసని నమ్మబలికారు. రూ.15 లక్షలు ఇస్తే రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. దానికి బాధితుడు అంగీకరించి విడతలవారీగా రూ. 9.40 లక్షలు వారి ఖాతలో జమ చేశాడు.
జల్సాలకు అలవాటుపడి...
ఉద్యోగం గురించి అడుగుతుంటే మాట దాట వేస్తుండటంతో.. మోసపోయానని గ్రహించిన బాధితుడు ఆనంద్.. అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.9 లక్షలు స్వాధీనం చేసుకునట్లు డీఎస్పీ సుప్రజ వెల్లడించారు. ప్రధాన నిందితుడు మస్తానయ్య బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో బి.టెక్ చదువుతున్న సమయం నుంచి జల్సాలకు అలవాటుపడి క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతూ, సులభంగా డబ్బు సంపాదించాలని చూస్తూ ఉండేవాడని డీఎస్పీ వివరించారు.
ఇవీ చూడండి...