ఓ వ్యక్తి నుంచి ఫోన్ను దొంగలించి.. అందులో ఉన్న ఫోన్ పే ద్వారా 85 వేల నగదును తన ఖాతాకు మళ్లించుకున్న దొంగను గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన షహజాద్ గా గుర్తించారు. అతడి నుంచి 70 వేల నగదుతో పాటు.. ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనం సైతం దొంగలించిందేనని గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.
అసలు ఏం జరిగిందంటే..
తెనాలి పట్టణం రామలింగేశ్వరపేట కిరాణా దుకాణంలో.. ఈ నెల 15న 5 వేలు విలువ చేసే ఫోన్ చోరీ జరిగింది. బాధితుడు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈనెల 19న బాధితుడు తన కుమార్తె ఫీజు కట్టడానికి నగదు తీయటానికి బ్యాంకుకు వెళ్తే.. ఖాతాలో నగదు లేనట్లు తెలిసింది. కంగారు పడిన బాధితుడు బ్యాంకులో విచారించగా.. ఫోన్ పే యాప్ ద్వారా 85 వేల నగదు బదిలీ అయినట్లు అధికారుల తెలిపారు. ఈ విషయంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు.. ఫోన్ పే ద్వారా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఖాతాకు నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. లాక్డౌన్ సడలింపుల తరువాత ఉత్తరప్రదేశ్ నుంచి తెనాలికి వచ్చిన వారి వివరాలను సేకరించి.. వారిలో నిందితుడిని గుర్తించారు.
కేసు ఒక కొలిక్కి వచ్చిందని అనుకున్న సమయంలో నిందితుడు తెనాలిలో లేడు. అతడి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు.. తెనాలిలో తిరుగుతున్న సమయంలో అరెస్టు చేశారు. నిందితుడు తెలంగాణ రాష్ట్రం పాల్వంచ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి.. అక్కడ నుంచి తెనాలి వచ్చినట్లు గుర్తించారు.
ఇదీ చదవండి: