లాక్‌డౌన్ సమయంలో ఉత్పత్తి చేసిన గుడ్లు మార్కెఫట్‌కు పంపే సౌకర్యం లేక రూ.2లోపు ధరకే రైతులు విక్రయించి నష్టాలు మూటగట్టుకున్నారు. జాతీయ రహదారులపై రాకపోకలు సాగుతున్నా దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు తెరవకపోవడం, రైళ్లు నిలిచిపోవడంతో వినియోగదారుల చెంతకు తీసుకెళ్లలేకపోయారు. మరోవైపు దాణా రవాణా నిలిచిపోవడం, తయారీ యూనిట్లు మూతపడటంతో తీవ్రమైన కొరత ఏర్పడింది. గుడ్ల ధర పడిపోవడం, దాణా లభ్యత లేక పెంపకందారులు మోల్టింగ్(కోళ్లకు ఆహారం బాగా తగ్గించి వేయడం) అమలు చేశారు. దీనివల్ల కోళ్లలో గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని తగ్గించి బతికించుకున్నారు. గుడ్ల ఉత్పత్తి 45 శాతం వరకు తగ్గింది. కొందరు కోళ్లను మేపలేక అమ్మేసుకున్నారు. మొత్తం మీద 40 లక్షల నుంచి 50 లక్షల కోళ్లు వ్యాధులతో చనిపోవడం లేదా తీసివేయడం గాని చేశారు.
గుడ్లకు పెరిగిన గిరాకీ:
లాక్‌డౌన్ సడలింపులు, బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని వైద్యుల సూచనతో గుడ్ల వినియోగం పెరిగింది. ఈక్రమంలో గుడ్ల ఉత్పత్తి పెంచడానికి రైతులు ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికీ సాధారణ ఉత్పత్తిలో 30 శాతం ఉత్పత్తి తగ్గినట్లు చెబుతున్నారు. మార్కెట్‌లో డిమాండ్ మేరకు సరఫరా లేక క్రమంగా గుడ్ల ధర పెరుగుతోంది. వినాయక చవితి తర్వాత ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు పెరగడం, స్థానికంగా వినియోగం పెరగడంతో ధర పెరుగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సగటున రోజుకు 7.50 కోట్ల గుడ్ల ఉత్పత్తి రావాల్సి ఉండగా, ప్రస్తుతం 5.50 కోట్లకు మించడం లేదు. దీంతో 2 కోట్ల గుడ్ల వరకు ఉత్పత్తి తగ్గింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజూ అంగన్‌వాడీలు, పాఠశాల విద్యార్థులకు కలిపి 55 లక్షల గుడ్లు పంపిణీ చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం 20 లక్షల నుంచి 25లక్షల గుడ్లు తీసుకుంటోంది. దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం డిమాండ్‌కు అనుగుణంగా గుడ్ల ఉత్పత్తి లేకపోవడంతో ధర పెరుగుతోందని గుంటూరుకు చెందిన లేయరు కోళ్ల పెంపకందారు ధర్మతేజ తెలిపారు. గుడ్ల ఉత్పత్తి సాధారణ స్థితికి రావాలంటే ఫిబ్రవరి నెల వరకు సమయం పడుతున్నందున అప్పటి వరకు డిమాండ్ కొనసాగుతుందని అంచనా వేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: రాజధాని భూముల కేసుపై ఏపీ హైకోర్టు స్టే