ఐకానిక్ వంతెన స్థానంలో సాధారణ వంతెననే జాతీయ ప్రాధికార సంస్థ నిర్మించనుంది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను ఈ వారంలో పూర్తి చేయనుంది.
గొల్లపూడి వద్ద కృష్ణానదిపై 3.1 కి.మీ.మేర ఈ వంతెనను నిర్మించాల్సి ఉంది. 6 వరుసలతో వంతెన నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ గతంలోనే సిద్ధమైంది. అయితే రాజధానిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గత తెదేపా ప్రభుత్వం ఐకానిక్ వంతెన నిర్మించాలని ప్రతిపాదించింది. దీనికి కేంద్రం మొగ్గుచూపలేదు. సాధారణ వంతెన నిర్మిస్తే రూ.400 కోట్లతో పూర్తవుతుంది, అదే ఐకానిక్ వంతెన అయితే రూ.800 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని అంచనా వేసింది. అదనపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కేంద్రం కోరింది. ఈలోగా ప్రభుత్వం ఐకానిక్ వంతెన పై ఆసక్తి చూపలేదు. ప్రజలకు సౌకర్యంగా ఉంటే చాలని...ఐకానిక్ వంతెన అవసరంలేదని రాష్ట్రప్రభుత్వం అభిప్రాయపడింది. ఇందుకోసమే ఎన్హెచ్ఏఐ సాధారణ వంతెన నిర్మాణానికి సిద్ధమైంది.
బెంజ్‌సర్కిల్ వద్ద..
విజయవాడ మచిలీపట్నం జాతీయరహాదారిలో భాగంగా బెంజ్ సర్కిల్ వద్ద కోల్కత్తా- చెన్నై జాతీయ రహదారిపై ఇరువైపులా మూడు వరుసలతో 2 వంతెనలను నిర్మించాలని గతంలో భావించారు. వీటిలో ఏలూరు వైపునుంచి కనకదుర్గ వారధివైపునకు నిర్మిస్తున్న వంతెన దాదాపు పూర్తికావొచ్చింది.మరోవైపు సమాంతరంగా రెండో వంతెన నిర్మించాల్సి ఉన్నప్పటికీ విజయవాడ బైపాస్ నిర్మాణం జరుగుతున్నందున దీనిని నిలిపివేసారు. ఒకవేళ అది పూర్తయితే కోల్కత్తా- చెన్నై మీదుగా వెళ్లే వాహనాలు బెంజ్ సర్కిల్ మీదుగా రావని, అప్పుడు వంతెన అవసరం ఉండకపోవచ్చని ఎన్హెచ్ఏఐ అధికారులు అనుకున్నారు. అయితే ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిల్లీ పర్యటనకు వెళ్లినపుడు కేంద్ర ఉపరితలశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. వివిధ రహదారి ప్రాజెక్టులపై ఆయనతో చర్చించినపుడు బెంజ్ సర్కిల్ వద్ద మరో వంతెన అంశం ప్రస్తావనకు వచ్చింది. భవిష్యత్‌లో విజయవాడలో ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున వంతెన అవసరమని సీఎం కోరారు. దీంతో గడ్కరీ ఆమోదం తెలిపారు. త్వరలో దీనికి సంబంధించిన ఆదేశాలొస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త వంతెనకు రూ.150 కోట్ల వ్యయం అవుతుందని భావిస్తున్నారు.