జలవనరుల శాఖలో కొత్తగా చేపట్టి, 25 శాతం లోపు మాత్రమే పనులు పూర్తయిన ప్రాజెక్టుల టెండర్లు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్నల్ బెంచ్ మార్క్ విలువ కన్నా అధిక ధరలకు దాఖలైన టెండర్లను తక్షణమే రద్దు చేయాలని నిర్ణయించింది. జలవనరుల శాఖపై సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్ అధికారులకు పలు అంశాలపై సూచనలు చేశారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. అవసరమైన ప్రాజెక్టులకు మాత్రమే రీటెండరింగ్‌కు వెళ్లాలని సూచించారు. ఐబీఎం విలువ కన్నా తక్కువకు దాఖలైన టెండర్లలో 25శాతం లోపు పని జరిగితే పునఃసమీక్షించాలని ఆదేశించారు. వీటిలో ఏ ప్రాజెక్టయినా అవసరమనిపిస్తే కొనసాగించి లేదనుకుంటే రద్దు చేయాలని పేర్కొన్నారు.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే లక్ష కోట్లకు పైగా అవసరమవుతాయని జగన్ అన్నారు. వీటికి ఏడాదికి 10 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసే సామర్థ్యం ఉన్నందున ప్రాజెక్టుల ప్రాధాన్యక్రమం సిద్ధం చేయాలని సూచించారు. రాబోయే నాలుగేళ్లలో ఏ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. దేవుడి దయవల్ల రెండోసారి వరద వచ్చిందన్నారు. కృష్ణా జలాలు బాగా వచ్చాయని అభిప్రాయపడ్డ సీఎం... సీమ ప్రాజెక్టులను నింపడానికి ఎక్కువ సమయం పడుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టు, జంఝావతి, వంశధార రెండో దశ, నేరడి బ్యారేజీ తదితరాలపై ఒడిశాకు ఉన్న అభ్యంతరాలపై పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేయాలన్నారు. వీటిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చిద్దామని సీఎం జగన్ చెప్పారు.