EX CM YS Jagan Defends SECI Power Deal in AP : సెకితో విద్యుత్ ఒప్పందంతో చరిత్ర సృష్టించానని, తనను శాలువాతో సత్కరించకుండా బురదజల్లడమేంటని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) వ్యక్తం చేసిన ఆవేదనలో ఏ మాత్రం అర్థం లేదని విద్యుత్ రంగంపై అవగాహన ఉన్న ఏ ఒక్కరైనా ఇట్టే తేల్చేస్తారు. విలేకర్ల ప్రశ్నలకు తడుముకుంటూ, తటపటాయిస్తూ ఆయన ఇచ్చిన సమాధానాలే అసలు విషయాన్ని సూచనప్రాయంగానైనా తెలియజేస్తున్నాయి. జగన్ ప్రస్తావించిన కొన్ని అంశాలు, అసలు వాస్తవాల్ని ఓసారి పరిశీలిద్దాం.
విద్యుత్ కొనుగోలు ఒప్పందం సెకి, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య జరిగిందని జగన్ తెలిపారు. మధ్యలో దళారీ లేడని, ఎక్కడా థర్డ్ పార్టీ లేదని అన్నారు. అలాంటప్పుడు అవినీతికి అవకాశం ఎక్కడ ఉంటుంది అంటూ ఆయన ప్రశ్నించారు.
నిజం : వాస్తవమేమిటంటే ఇక్కడ సెకినే దళారీ కదా! అదానీ, అజూర్ సంస్థలు రాజస్థాన్‌లో ఏర్పాటు చేసే ప్లాంట్లలో ఉత్పత్తి చేసే విద్యుత్‌ను యూనిట్‌కి ఏడు పైసల కమీషన్ తీసుకుంటూ రాష్ట్రాలకు అమ్మిపెట్టడంలో దళారీగా వ్యవహరించింది సెకినే! అదానీ, అజూర్‌లతో సెకి పీపీఏలు చేసుకోవాలంటే ఆ విద్యుత్‌ను విక్రయించేందుకు ముందు డిస్కంలను వెతకాలి. కానీ ధరలు ఎక్కువగా ఉండటంతో, ఆ విద్యుత్ కొనేందుకు ఏ రాష్ట్రాలూ ముందుకు రాలేదు.
అదానీ సూచనతోనే సెకి రంగంలోకి దిగి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అదానీ అప్పటికే గత ప్రభుత్వ పెద్దలతో 'అవగాహన'కు రావడంతో సెకి ప్రతిపాదన మేరకు 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చకచకా ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం సెకి, ఏపీ ప్రభుత్వం, డిస్కంల మధ్య జరిగినట్టు పైకి కనిపిస్తున్నా ఒప్పందం చేసుకుంది 'థర్డ్‌పార్టీ' అదానీతోనే. రాష్ట్రానికి వచ్చే విద్యుత్ అదానీదేనని సెకితో ప్రభుత్వం, డిస్కంలు చేసుకున్న అనుబంధ ఒప్పందాల్లో స్పష్టంగా ఉంది.
తక్కువ రేటు తీసుకొచ్చి, ఇంత గొప్ప ఒప్పందం చేసుకున్నందుకు తనను శాలువా కప్పి సత్కరించాలని, అలాగే గౌరవించాలని జగన్ వెల్లడించారు.
నిజం : అవును వాస్తవంగానే జగన్‌ను సత్కరించాలి! అదానీతో తెర వెనుక ఒప్పందం చేసుకుని 'అవినీతి కేసుల ప్రతిభ'ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లినందుకు సన్మానం చేయాచాల్సిందే.
గతంలో రాష్ట్రంలో సగటు విద్యుత్ కొనుగోలు ధర యూనిట్‌కు రూ.5.10 ఉండేదని, మనకు కేవలం రూ.2.49కే ఇచ్చేందుకు కేంద్ర సంస్థ ముందుకు వచ్చిందని జగన్ తెలిపారు. దాని వల్ల 25 సంత్సరాల్లో రూ.1.0 లక్షల కోట్లు ఆదా అని చెప్పుకొచ్చారు ఆయన.
నిజం : వాస్తవం ఏమిటంటే ఇంగితం ఉన్నవాళ్లు ఎవరైనా మార్కెట్‌లో ప్రస్తుం లభిస్తున్న ధరలతో పోల్చి చూస్తారా? కొన్ని సంవత్సరాల క్రితం నుంచీ ఉన్న ధరల సగటుతో పోల్చి తక్కువకు కొంటున్నామని గొప్పలు చెబుతారా?
యూనిట్ విద్యుత్ రూ.2.49కే కొనడం ఒక చరిత్ర అని, అది తమ వల్లే సాధ్యమైంమైందని జగన్ అన్నారు.
నిజం : సుమారు రెండు వేల కిలో మీటర్ల దూరంలో పెట్టే ప్లాంట్ల నుంచి కరెంటు కొనడం, 2019లో టెండర్లు పిలిచి ఎవరూ కొనని కరెంట్‌ను 2024 నుంచి సరఫరా చేస్తామని ఆ సంస్థలు చెబితే 2021 డిసెంబరులోనే ఒప్పందం చేసుకోవడం ఓ చరిత్రే. ఆ ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభం అయ్యే నాటికి ఉన్న టారిఫ్ కంటే తక్కువకు ఒప్పందాలు చేసుకోవాలని అధికారులు అంతా నెత్తీ నోరూ కొట్టుకుని చెప్పినా బేఖాతరు చేయడం దేనికి సాక్ష్యం?
రాష్ట్రానికి ఇంత మంచి చేస్తూ అడుగులు ముందుకు వేస్తుంటే బురద జల్లడం ఏంటని ఇది ధర్మమేనా అంటూ జగన్ ప్రశ్నించారు.
నిజం : ఇది నిజానికి వెలికితీయడం. ప్రజలపై ఐదు సంవత్సరాల వ్యవధిలో రకరకాల రూపాల్లో, ఎప్పుడూ వినని ట్రూ అప్, ఎఫ్‌పీపీసీఏ (FPPCA) వంటి పేర్లతో సుమారు రూ.18,817 కోట్ల ఛార్జీల భారం మోపారు. ఓ వ్యక్తి అవినీతి వల్ల సెకి ఒప్పందం అమల్లోకి వస్తే 25 సంవత్సరాల్లో ప్రజలపై ఏ 2 లక్షల కోట్లో భారం పడుతుందన్న ఆందోళన ఇది.
అమెరికా సంస్థల నివేదికలు తన పేరు ఎక్కడ లేదని జగన్ చెప్పారు.
నిజం : సెక్యురిటీస్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) నివేదిక చూస్తే ఎవరికి అయినా అర్థం అవుతుంది. అందులో 80వ పాయింట్ నుంచి 84 వరకు చూస్తే 2021 ఆగస్టులో రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా కలిశాకే విద్యుత్తు సరఫరా ఒప్పందం ముందుకు కదిలిందని స్పష్టంగా తెలిపింది. లంచం సొమ్ము సుమారు రెండు వందల మిలియన్ డాలర్లుగా, అదానీ గ్రీన్స్ అంతర్గత రికార్డుల ద్వారా తెలుస్తోందని వెల్లడించింది. సీఎంను కలిసి లంచం ఇస్తామని మాట ఇచ్చాకే సెకి ద్వారా అదానీ గ్రీన్, అజూర్ నుంచి విద్యుత్తు కొంటామని సమాచారం ఇచ్చినట్టు పేర్కొంది. ఆ తరువత సెకి ఆఫర్‌ను అంగీకరిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని తేల్చి చెప్పింది. లంచాలు పని చేశాయని కుండబద్దలు కొట్టింది. ఒప్పందంలో అవినీతి బాగోతానికి ఇంతకంటే రుజువులు ఏం కావాలి? ఎఫ్‌బీఐ (FBI) రిపోర్టులోనూ ఫారిన్ అఫీషియల్ 1కు (సీఎం) 1,750 కోట్ల లంచాలు ఇవ్వజూపారని స్పష్టంగా తెలిపింది.
గౌతమ్ అదానీ అదానీ తనను ఎన్నోసార్లు కలిశారని జగన్ తెలిపారు. దానికి, దీనికి ఏం సంబంధమని ప్రశ్నించారు.
నిజం : పారిశ్రామికవేత్తలు సీఎంతో భేటీ అయినప్పుడు ఏ పెట్టుబడులపై చర్చించారో ప్రకటనలు ఇవ్వడం సర్వసాధారణం. కానీ జగన్ మోహన్ రెడ్డిని గౌతమ్ అదానీ కలసిన తరువాత అలాంటి ప్రకటనలు ఏవీ ఇవ్వలేదు. పైగా తక్కువ వ్యవధిలోనే గౌతమ్ అదానీకి ప్రయోజనం కలగడం చూస్తే దాని వెనుక మతలబు ఏంటో ప్రతి ఒక్కరికీ తెలిసిపోతుంది.
ఏపీలో సోలార్ పార్కులకు టెండర్లు పిలిస్తే, యూనిట్ రూ.2.49 నుంచి రూ.2.58 చొప్పున సరఫరా చేసేలా ఎన్టీపీసీ (NTPC) వంటి పెద్ద సంస్థలు టెండర్లలో పాల్గొన్నాయని జగన్ తెలిపారు. న్యాయ వివాదాల కారణంగా ప్రక్రియ నిలిచిందని ఆయన వివరించారు.
నిజం : టెండర్ల ప్రక్రియ నిలిచిపోవడం వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్వాకమేగా! ఈ ప్రక్రియలో తనకు అన్యాయం జరిగిందని టాటా లాంటి ప్రఖ్యాత సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కేవలం కొన్ని సంస్థలకు ప్రయోజనం కలిగించేలా టెండరు నిబంధనలు ఉన్నాయి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేసింది.
అసలు ఒప్పందం అదానీతోనే! - ఈ అనుబంధ ఒప్పందాలే నిదర్శనం
నిబంధనలకు పాతర - అదానీ సంస్థతో విద్యుత్ ఒప్పందాలు
కేంద్రం ఇచ్చే రాయితీ కొంతే - సెకి విద్యుత్‌కు ఐఎస్‌టీఎస్ ఛార్జీలు చెల్లించాల్సిందే!