గుంటూరులోని పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ వద్ద ఓ వ్యాపారి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. లాక్డౌన్ సమయంలో మార్కెట్లోని దుకాణాల్ని వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. బిల్డ్ ఏపీలో భాగంగా... మార్కెట్‌ను వేలానికి పెట్టారు. దీనిపై కొందరు హైకోర్టుని అశ్రయించారు. అయితే వ్యాపారుల ఆందోళను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బిల్డ్ ఏపీ నుంచి మార్కెట్ స్థలాన్ని మినహయించింది.
ఇపుడు లాక్డౌన్ ఆంక్షలు తొలగిన తరుణంలో వ్యాపారులు కొందరు మార్కెట్లో దుకాణాలు ప్రారంభించారు. అయితే దుకాణాలు తెరిచేందుకు వీళ్లేదని మున్సిపల్ అధికారులు ఆదేశించారు. అధికారులు, పోలీసుల వైఖరికి నిరసనగా వ్యాపారుల ఆందోళనకు దిగారు. ఎక్కడా లేని కరోనా నిబంధనలు గుంటూరు కూరగాయల మార్కెట్ కే ఎందుకని ప్రశ్నించారు. ఓ వ్యాపారి పెట్రోల్ ఒంటిపై పోసుకోవటంతో పక్కన ఉన్నవారు అప్రమత్తమయ్యారు. వెంటనే అతని నుంచి సీసా లాక్కున్నారు.
ఈ ఘటనతో ఆందోళన మరింత తీవ్రరూపం దాల్చింది. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా వ్యాపారులు నినాదాలు చేశారు. కొన్ని దశాబ్దాలుగా మార్కెట్ పై ఆధారపడి ఉన్న తమ జీవితాల్ని నాశనం చేయొద్దని వేడుకున్నారు. ఈ వ్యవహారంపై పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ, హోంమంత్రి మేకతోటి సుచరిత అధికారులతో మాట్లాడారు. రోజూ 100 దుకాణాలు తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... విడతల వారీగా దుకాణాలు నిర్వహించుకోవాలని సూచించారు. అధికారుల సూచనలతో వ్యాపారులు శాంతించారు.