Mobile Testing Lab to detect Polluted Water : తాగునీరు కలుషితమైందా.. కఠినత్వంతో ఉందా.. ఏయే లవణాలు ఉన్నాయి.. తాగడానికి పనికి వస్తుందా, రాదా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా.. ఇక అందుకు ఎలాంటి చింత అవసరం లేదు. మీ చెంతకే సంచార ప్రయోగశాల(మొబైల్ టెస్టింగ్ ల్యాబ్) రానుంది. నీళ్లలోని 14 రకాల ధాతువుల గుట్టు విప్పి చెప్పేందుకు తెలంగాణ భూగర్భజల వనరుల శాఖ ఈ ల్యాబ్‌ను జిల్లాలకు అందుబాటులోకి తెస్తోంది. కొద్దిరోజుల్లో నలుగురు సిబ్బంది, ల్యాబ్‌తో కూడిన వ్యాన్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. రూ.కోటి వ్యయంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు.
water quality detecting method : ఆన్‌లైన్‌లో సమాచారం.. భూగర్భ జలాల్లో శుద్ధతను పరీక్షించి ఫలితాలను ఆన్‌లైన్ ద్వారా అందించనున్నారు. కలుషితాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తిస్తే ఆ నీటి నమూనాలను రాష్ట్రంలో ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్‌లలో ఉన్న ప్రధాన ప్రయోగశాలలకు పంపుతారు. ఫ్లోరైడ్, నైట్రేట్, మెగ్నీషియంతోపాటు 14 రకాలను ఈ ల్యాబ్‌లో పరీక్షించి వాటి మోతాదును వెల్లడిస్తారు.
జిల్లాలకు వ్యాన్ వెళ్లే షెడ్యూల్‌ను ప్రకటించి అందుబాటులో ఉండే సమయాలను అధికారులు ఎప్పటికప్పుడు ప్రకటిస్తారు. నీటి నాణ్యతను ప్రజలు సులువుగా తెలుసుకునేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ సంచాలకుడు పండిట్ మద్నూరే తెలిపారు. ‘ఈ ప్రాజెక్టుతో ప్రజలు వారు వినియోగించే నీటి నాణ్యతను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏడాదిలో 240 రోజులు జిల్లాలకు అందుబాటులో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. కెమిస్టు, సాంకేతిక సిబ్బంది కూడా వ్యాన్‌లో ఉంటారు’ అని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు మూత్రపిండాల వైఫల్య వ్యాధికి కలుషితమైన నీరు తాగడమే కారణమట. బీపీ, షుగర్ తదితరాలు ఇప్పటివరకు దీనికి ప్రధాన కారకాలుగా గుర్తించగా, ఇప్పుడు ఆ జాబితాలో ప్రమాదకర ఖనిజం సిలికా చేరింది. ‘సిలికా’తో కలుషితమైన నీరు మూత్రపిండాలపై విషం చిమ్ముతోందని తాజా పరిశోధనలో తేటతెల్లమైంది.
లోతైన బోరు నీటిని తాగడం, దాంతో పండించిన వరి, చెరకులను తినడం, గ్రానైట్ ధూళి కణాలను పీల్చడం వంటి పరిస్థితుల వల్ల శరీరంలోకి సిలికా చేరి.. మూత్రపిండాల ముప్పు అధికమవుతోందని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికా, మెక్సికో, స్వీడన్, బ్రిటన్, థాయిలాండ్, భారత్ తదితర దేశాల్లో సాగిన పరిశోధనలో మన దేశం నుంచి శ్రీరామచంద్ర మెడికల్ అండ్ రీసెర్చి సెంటర్ (తమిళనాడు), నిమ్స్ (హైదరాబాద్) భాగస్వాములయ్యాయి. నిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ తాడూరి గంగాధర్ ఇందులో పాలుపంచుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఆదిలాబాద్, సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, చీమకుర్తి, ఉద్దానం ప్రాంతాలు, ఒడిశా, గోవా, తమిళనాడు రాష్ట్రాల్లో పరిశోధన సాగింది. మూడేళ్లుగా ఎలుకలపై చేసిన ప్రయోగాలతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎలుకలకు సిలికాతో కూడిన నీటిని, సిలికా దుమ్ముతో నిండిన గాలిని అందించారు. దీంతో వాటి మూత్రపిండాలు చెడిపోయినట్లు గుర్తించారు. మనుషుల్లోనూ ఇదే దుష్ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధన పత్రం ప్రఖ్యాత వైద్యపత్రిక ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ’లో ప్రచురితమైంది.
ఇవీ చదవండి: