Telangana Election Results Effect on YCP Govt: ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు వైఎస్సార్సీపీ నేతల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. నిన్న కర్ణాటక. నేడు తెలంగాణ. మరి రేపు ?! కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం సాధిస్తోందా ? దక్షిణ భారతాన మళ్లీ పుంజుకుంటోందా? ప్రజలు మార్పు కోరుకుంటున్నారా ? తెలంగాణలో భారీ విజయం నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై ఆంధ్రప్రదేశ్‌లో చర్చోపచర్చలు. ఏ నలుగురు కలిసినా వారి మధ్య హాట్ టాపిక్ ఇదే.
ఏపీలోనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ కాల పరిమితి ముగుస్తోంది. మరో మూడు నెలల్లో ఎన్నికల నగారా మోగనుంది. ఇటు చూస్తే దక్షిణ భారతంలో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇదే దూకుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ కొనసాగిస్తే తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారవచ్చని వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఆందోళన ప్రారంభమైంది. బలమైన కాంగ్రెస్ ఓటు బ్యాంకును పూర్తిగా తమ గుపెట్లో పెట్టుకున్న ఆ పార్టీకి తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు మింగుడుపడటం లేదు.
జగన్ పాలనపై క్షేత్రస్థాయిలో అసంతృప్తి పెల్లుబుకుతున్న ఈ తరుణంలో పక్కరాష్ట్రం తెలంగాణలో గెలుపు వైఎస్ జగన్‌కి అశనిపాతంగా మారొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ నుంచి తమ గూటిన చేరిన పాత నాయకులంతా మళ్లీ జట్టు కడతారా? ఒకవేళ అదే జరిగితే తమ పుట్టి మునుగుతుందా? నేతలతో పాటు ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్‌కు వలసపోతే వైఎస్సార్సీపీ పరిస్థితి ఏంటి? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్‌తో ఎవరికి నష్టం?
కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలోనూ కాంగ్రెస్ విజయబావుటా ఎగరేసింది. ఇక తదుపరి లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు రెండు సార్లు తండ్రిని ముఖ్యమంత్రిని చేస్తే ఆ కృతజ్ఞత కూడా చూపకుండా అధినాయకత్వంపై తిరుగుబాటు చేసి సొంత కుంపటి పెట్టుకున్న వైఎస్ జగన్‌ను ఎలాగైనా దెబ్బకొట్టాలని రాహుల్‌గాంధీ కృతనిశ్చయంతో ఉన్నారని ఆ మధ్య వార్తలొచ్చాయి.
ఇకపై రాహుల్ తన ఆలోచనలకు కార్యరూపమిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ను ముందుపెట్టి ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పార్టీని ఇరుకున పెట్టవచ్చు. అలాగే వైఎస్సార్సీపీ నేతలను తిరిగి కాంగ్రెస్‌లోకి రప్పించే ప్రణాళికలనూ అమలు చేయవచ్చన్న అభిప్రాయముంది. ఇండియా కూటమిలో భాగస్వాములైన వామపక్షాలను కలుపుకుని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పునర్వైభవం దిశగా అడుగులు వేస్తోందని అంచనా వేస్తున్నారు. ఎన్నికలకు సమయంలో వైఎస్సార్సీపీని దెబ్బకొట్టే అస్త్రాలను కాంగ్రెస్ కచ్చితంగా అమలు చేస్తోందని విశ్లేషకులు చెప్తున్న మాట.
వైసీపీ నేతల్లో గుబులు
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్‌లోని పాత "హస్తం" నేతలు ఊపిరి పీల్చుకుంటున్నారు. జగన్ నియంతృత్వ ధోరణిపై అసంతృప్తితో ఉన్న నాయకులంతా అటు టీడీపీ, ఇటు కాంగ్రెస్‌లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా పార్టీల్లోని ప్రముఖులతో టచ్‌లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
"ఆంధ్రప్రదేశ్‌లో మా పార్టీకి పూర్వ వైభవం వస్తుంది, వైఎస్సార్సీపీలోని సీనియర్ నేతలంతా ఒకప్పటి కాంగ్రెస్ నాయకులే. వాళ్లంతా మళ్లీ మా పార్టీలోకి వస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. జగన్‌తో ఇమడలేకపోతున్న సీనియర్ల నేతలకు ఇప్పటిదాకా సరైన ప్రత్యామ్నాయం దొరకలేదు. ఇష్టమున్నా లేకున్నా గుంభనంగా వైఎస్సార్సీపీనే అంటిపెట్టుకొని ఉన్నారు" - చింతా మోహన్, మాజీ ఎంపీ
ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు
గతేడాది భారత్ జోడో యాత్ర చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించారు. తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన ఆయన పాదయాత్ర కేరళ, కర్ణాటక మీదుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొనసాగింది. ఈ సందర్భంగా ఏపీలో మాట్లాడిన రాహుల్ గాంధీ రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను ఉటంకించారు. రాష్ట్ర విభజన హామీలను తప్పకుండా అమలు చేస్తామని విస్పష్టంగా ప్రకటించారు.
ప్రత్యేక హోదా అంశంతో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామనీ చెప్పారు. ఉత్తరాంధ్ర జీవగర్ర విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయబోమని, ప్రత్యేకంగా గనులు కేటాయిస్తామనీ అన్నారు. ఎన్నికల వేళ కర్ణాటక, తెలంగాణలో మాదిరిగా ఆకర్షణీయ మేనిఫెస్టోతో ముందుకొస్తే తమ పరిస్థితి ఏంటని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
జనాగ్రహానికి తా'కారు'మారు
అప్పటి మద్రాసు నుంచి విడిపోయి కర్నూలు రాజధానిగా కొనసాగిన ఆంధ్ర రాష్ట్రం పెద్ద మనుషుల ఒప్పందం (Gentlemens Agreement) ఫలితంగా హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్‌గా ఆవిర్భవించింది. 58ఏళ్ల చరిత్ర కలిగిన ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ఏపీలో దారుణ ఫలితాలను మూటగట్టుకుంది. విభజనానంతరం అధికారంలోకి వచ్చిన అనుభవజ్ఞుడైన చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణం దిశగా అడుగులు వేశారు. రాజధాని అభివృద్ధిలో రైతులను భాగస్వామ్యం చేస్తూ భూసేకరణ చేశారు. అమరావతి రాజధాని హామీ ఇచ్చిన వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి రాగానే మాట మార్చారు. మూడు రాజధానుల పల్లవి అందుకోవడంతో అమరావతి అభివృద్ధికి బ్రేకులు పడ్డాయి.
తెలంగాణలో అలా
నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ తొమ్మిదేళ్లపాలనలో సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసింది. దీనికి తోడు ప్రకృతి కరుణించడంతో వ్యవసాయం పురోగతి సాధించింది. బీఆర్ఎస్ సర్కారు తీసుకువచ్చిన ధరణి కారణంగా సన్న, చిన్నకారు రైతులు ఎంతో మంది ఇబ్బందులు పడగా మరోవైపు నిరుద్యోగులు, ఉద్యోగుల్లో అసంతృప్తి పెరిగిపోయింది. రైతు బంధు, రైతు బీమా సహా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినా ప్రభుత్వం ప్రజల అంచనాలు అందుకోలేకపోయింది. అంతో ఇంతో అభివృద్ధి జరిగిన తెలంగాణలోనే కాంగ్రెస్ హవా కొనసాగిందంటే విధ్వంస పాలన కొనసాగుతున్న ఏపీలో ఏం జరగనుందో!