కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నడుంబిగించారో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. కరోనా నివారణను సామాజిక బాధ్యతగా భావించి ద్విచక్రవాహనంపై పయనిస్తూ... ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. గుంటూరు జిల్లా అమరావతి మండలం జూపూడి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బలుసుపాటి సత్యనారాయణ... కరోనా మహమ్మారిపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
సొంత ఖర్చులతో మాస్కులు, శానిటైజర్లు పంచుతున్నారు. ప్రత్యేక వాహనంపై మైక్ ఏర్పాటు చేసుకున్న సత్యనారాయణ... అమరావతి, పెదకూరపాడు మండలాల్లో కరోనా వ్యాధి లక్షణాలు, వ్యాప్తి విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తున్నారు.
తన పాఠశాలలోని 60 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు బియ్యం, కూరగాయల పంపిణీతోపాటు యానాది కాలనీ, ఆలయాల వద్ద యాచకులకు, నిరుపేదలకు నిత్యావసరాలు అందించి కరోనా కష్టకాలంలో ఆపన్నహస్తం అందిస్తున్నారు. అమరావతి కూరగాయల మార్కెట్, బ్యాంకు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించేలా మార్కింగ్ వేసి పోలీసులకు సహకరిస్తున్నారు.
ఇవీ చూడండి...