TDP Released the Book on YCP Navaratnalu: మేనిఫెస్టోలో 99శాతం హామీలు అమలు చేశామంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం అవాస్తవమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. 'ప్రకాశించని నవరత్నాలు - జగన్ మోసపు లీలలు' పేరిట టీడీపీ వాస్తవపత్రం అంటూ ఓ పుస్తకం విడుదల చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఈమేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ నేతలు అనగాని సత్యప్రసాద్, నక్కా ఆనంద్ బాబు, నజీర్ అహ్మద్, వర్ల రామయ్య, బొండా ఉమ, దేవినేని ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజా, అశోక్ బాబులు పుస్తకం విడుదల చేశారు.
నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు తొమ్మిదైతే.. వాటి కింద 40 హామీలు ఉన్నాయని టీడీపీ నివేదికలో పేర్కొంది. మేనిఫెస్టో ప్రకారం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన హామీలు 10 శాతం మాత్రమేనన్న ఆయన.. తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మోసగిస్తున్నారని మండిపడ్డారు. కుంటి సాకులతో పేదవాడి పథకాలన్నీ తీసేసి నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరత్నాల హామీలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
రైతు భరోసా కింద 13వేల 500 రూపాయల పెట్టుబడి సాయం కింద ఇస్తానని చెప్పిన జగన్.. ఇచ్చేది కేవలం రూ.7వేల 500 మాత్రమేనన్నారు. రైతు భరోసా కింద 12హామీలు ఇస్తే.. ఒక్కటీ అమలు చేయలేదని మండిపడ్డారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద ఇచ్చిన 8 హామీల్లో 8 అమలు కాలేదని అచ్చెన్న తెలిపారు. పింఛన్ల పెంపు కింద ఇచ్చిన 3 హామీల్లో రెండు అమలు కాలేదని పేర్కొన్నారు. అమ్మ ఒడి కింద ఇచ్చిన 2హామీల్లో రెండూ అమలు కాలేదని స్పష్టం చేశారు. పేదలందరికీ ఇళ్లు పేరిట ఇచ్చిన 5హామీల్లో 5అమలు కాలేదన్నారు. బోధనా రుసుము చెల్లింపు కింద ఇచ్చిన 2హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు.
వైయస్సార్ జలయజ్ఞం కింద ఇచ్చిన 3 హామీలకు మూడూ పెండింగ్లోనే ఉన్నాయని మండిపడ్డారు. మద్య నిషేధం అంటూ ఇచ్చిన ఒక్క హామీ ఇంతవరకు అమలు కాలేదని విమర్శించారు. వైఎస్సార్ ఆసరా, చేయూతల కింద ఇచ్చిన 4హామీల్లో 4పెండింగ్లోనే ఉన్నాయని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మందుల కొరత లేకుండా చేశామని.. నాలుగేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో పేదవాడికి సరైన వైద్యం అందుతుందా? అని ప్రశ్నించారు. జగన్ చెప్పేవన్నీ అసత్యాలే అని అందులో ఒక్కటీ నిజం ఉండదన్నారు. ఎన్నికల ముందు చెప్పేది ఒకటి.. అధికారంలోకి వచ్చాక చేసిందొకటని మండిపడ్డారు. అమ్మ ఒడి కింద 15 వేల రూపాయలు ఇస్తామని చెప్పి రూ.13 వేలు ఇస్తారా?.. అలాగే రాష్ట్రంలో 84 లక్షల మంది పిల్లలు ఉంటే 42 లక్షల మందికే ఇస్తారా? అని నిలదీశారు.
టీడీపీ హయాంలో పింఛన్ రూ.200 ఉంటే రూ.1800 పెంచి రూ.2 వేలు ఇచ్చామని.. అలాగే తాము.. 74 లక్షల మందికి పింఛన్ ఇస్తే మీరు 62 లక్షల మందికి ఇస్తారా అని ధ్వజమెత్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 10 లక్షల మందికి పింఛన్ తొలగించడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఏవేవో సాకులతో పేదవాడి పథకాలన్నీ తీసేసి మోసం చేస్తున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం కార్యక్రమం తీసుకొస్తామని.. ప్రతి మహిళకు రూ.15 వేలు ఇస్తామన్నారు.
ప్రభుత్వంపై కేసులు నమోదు చేయాలి: మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు లేనందుకు ప్రభుత్వంపై కేసులు నమోదు చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దొరికే నాసిరకం మద్యాన్ని అధికార పార్టీ నాయకులు తాగగలరా అని నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో 6093 ఖైదీలు కాగలరు కానీ.. సత్యా నాదెళ్లలు కాలేరని అన్నారు. ఎవరికో పుట్టిన బిడ్డకు తన పేరు పెట్టుకున్నట్లుగా.. టిడ్కో ఇళ్లపై ప్రచారం చేసుకుంటున్నారని నేతలు దుయ్యబట్టారు.