రాష్ట్రంలో గ్రామాలకు వైకాపా గ్రహణం పట్టిందని తెలుగుదేశం శాసనసభాపక్షం ధ్వజమెత్తింది. పెండింగ్‌లో ఉన్న 2వేల 500 కోట్ల ఉపాధిహామీ బిల్లులు చెల్లించాలంటూ చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేపట్టారు. రాష్ట్రంలో 70 వేల కోట్లు బకాయిలు ఉన్నాయన్న తెలుగుదేశం నేతలు.. జే ట్యాక్స్ కట్టిన వారికే చెల్లింపులు చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం హయాంలో నరేగా పనులు అత్యధికంగా ఎస్సీ, ఎస్టీలే చేపట్టారని.. బిల్లులు చెల్లించకపోవడంతో వీరంతా అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తలెత్తిందన్నారు.
కక్షసాధింపుతోనే జగన్ మాజీ సర్పంచులు, ఎంపీటిసీలు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులకు నరేగా బిల్లులు చెల్లించలేదని శాసనసభాపక్ష ఉపనేతలు చినరాజప్ప, బుచ్చయ్యచౌదరి విమర్శించారు. ఏడాది క్రితమే కేంద్రం వాటా 18 వందల 60 కోట్లు చెల్లించినా.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఇతర పథకాలకు మళ్లించిందని మండిపడ్డారు. నరేగా నిధులు సద్వినియోగం చేసుకుని తెలుగుదేశం హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్న నేతలు.. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో ఒక్క అభివృద్ధి పని చేపట్టలేదన్నారు. కనీసం రోడ్ల మరమ్మతులు కూడా చేయడం లేదన్నారు.
ఇదీ చదవండి:
తెలంగాణ: మధ్యాహ్నం 3 గంటల్లోపు రెండో రౌండ్ పూర్తైతే.. సాయంత్రానికి ఫలితాలు!