Anagani Fire on Jagan: ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి కాపులంటే ఎందుకంత కక్ష అని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. ఏ సినిమాకి లేని ఆంక్షలు ఒక్క పవన్ సినిమాకే ఎందుకంటూ నిలదీశారు. కాపులకు రిజర్వేషన్లు, భవనాలు నిలిపివేసినట్లుగా పవన్ కల్యాణ్ సినిమాను నిలిపేస్తారా? అంటూ ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం ఒక్క పవన్ కల్యాణ్‌ని ఇబ్బంది పెట్టేందుకు వేలాది మంది సినీ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. సీఎం జగన్ తన వ్యక్తిగత స్వార్థం కోసం సినీ పరిశ్రమపై ఆధారపడి ఉన్న లక్షలాది మందిని బలిచేస్తున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు కాపులకు పెద్దపీట వేస్తే జగన్ రెడ్డి కత్తిపీట వేశారని దుయ్యబట్టారు. ఒక్క రోజైనా కాపు కార్పొరేషన్‌పై సమీక్ష చేశారా అని ప్రశ్నించారు. మూడేళ్లలో కాపులకు ఏం చేశారో గుండెమీద చేయి వేసుకుని చెప్పగలరా? అని నిలదీశారు. కాపులకు చంద్రబాబు అన్నంపెడితే.. జగన్ వారి కడుపు కొడుతున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం కాపు వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు. కాపులను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అణగదొక్కుతున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి: చిన్నిగుండెకు కొండంత అండ... మూడు నెలల్లో 120 శస్త్రచికిత్సలు