TDP Protest On Roads Damage Issue in AP: ముంచెత్తుతున్న వర్షాలతో పాటు అస్తవ్యస్తంగా మారిన రహదారులు జనాన్ని తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నాయి. రహదారుల విషయంలో ప్రభుత్వం ఏ మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తుందంటూ తెలుగుదేశం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని పలు చోట్ల నిరసనలు చేపట్టింది.
భారీ వర్షాలు గుంటూరు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. నగరాన్ని ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే మరమ్మతులు లేక వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్న రోడ్లు వానలతో మరీ అధ్వానంగా తయారయ్యాయి. వాహనదారుల కష్టాలను చూసిన తెలుగుదేశం వినూత్న నిరసన చేపట్టింది. రోడ్డుపై మంచం వేసుకుని కూర్చుని, అనంతరం గుంతల్లో మొక్కలు నాటుతూ ఆందోళన చేపట్టారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వంలో మాత్రం చలనం రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ప్రతిరోజు వేలాది వాహనాలు వెళ్లే నందివెలుగు రోడ్డు, పొన్నూరు రోడ్లపై తట్టమట్టీ వేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వరదనీరు, మురుగునీరు రోడ్డుపై నిలిచిపోయి ఈ దారులగుండా ప్రయాణం చేసేవారు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకపోతే.. ఆందోళన ఉద్ధృతం చేస్తాం." -నసీర్ అహ్మద్, గుంటూరు తూర్పు టీడీపీ ఇన్‌ఛార్జి
గుంటూరు జిల్లాలోని తాడికొండ మండలం పాములపాడు గ్రామం శివారులోని వాగు ఉప్పొగింది. వరద నీరు ఉద్ధృతంగా రోడ్డుపై ప్రవహిస్తుండటంతో.. రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గతంలో వచ్చిన వరదలకు ప్రయాణికులు ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కొన్నారు.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో నీట మునిగిన కాలనీల దారులను, ముంపునకు గురైన పంట పొలాలను తెలుగుదేశం నేతలు పరిశీలించారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం అశ్వరావుపాలెంలో రోడ్ల దుస్థితిపై తెలుగుదేశం నేతలు వినూత్న నిరసన తెలిపారు. రోడ్డుమీద గుంతల్లో చేపలు పడుతూ. ఆందోళన తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రోడ్ల దుస్థితిపై టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. రహదారిపై ఏర్పడిన గుంతల్లో వరి నాట్లు వేశారు.
నీటమునిగిన రాష్ట్ర అతి పెద్ద లేఔట్: రాజకీయ లబ్దికోసమే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదలకు నివాస యోగ్యంకానీ ప్రదేశాల్లో.. ఇళ్ల స్థలాలిచ్చి వారి ఉసురుపోసుకుంటోందని టీడీపీ నాయకులు ఆరోపించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ బాబాప్రసాద్ టీడీపీ కార్పొరేటర్లతో కలిసి లేఔట్‌ను పరిశీలించారు. రాష్ట్రంలోనే అతి పెద్ద లేఔట్‌గా పాలకులు చెప్పుకుంటున్న మచిలీపట్టణం పరిధిలోని లేఔట్ రెండు రోజుల వర్షానికే నీట మునిగి.. చెరువును తలపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల పేరుతో ప్రభుత్వం పేదల జీవితాలతోని ఆడుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. పూరైన టిడ్కో ఇళ్లను పంచడానికి మనసురాని వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. అమోదయోగ్యంగా లేని ప్రదేశంలో స్థలాలిచ్చి ఇళ్లు నిర్మించుకోకుంటే రద్దు చేస్తామనటం దుర్మార్గమని మండిపడ్డారు.