నివర్ తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతున్నలను.. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని గుంటూరు జిల్లా తెనాలిలో తెదేపా నేతలు డిమాండ్ చేశారు. రైతులకు మేలు చేస్తున్నట్లు వైకాపా ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని.. మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆరోపణలు చేశారు. పంట నష్టపోయిన రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడటం దురదృష్టకరమని.. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు.
వైకాపా ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోంది: ఆలపాటి రాజా
రైతులకు మేలు చేస్తున్నట్లు వైకాపా ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు. రాజకీయ లబ్ది కోసం పేపరులో ప్రకటనలు ఇస్తున్నారే తప్ప.. క్షేత్ర స్థాయిలో అమలు శూన్యమన్నారు. ఎరువులు, పురుగు మందుల ధరలు పెంచారని.. కానీ పంట కొనుగోలు ధరలు మాత్రం పెరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటల గారడీతో వైకాపా ప్రభుత్వం పాలన చేస్తుందని విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో రైతులు అన్యాయమవుతున్నారని విమర్శించారు. రాజకీయ కక్షసాధింపు చర్యలు మానుకొని.. తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడటం దురదృష్టకరం: నక్కా ఆనంద్ బాబు
జగన్ ప్రభుత్వం రైతు ద్రోహిగా మిగిలిపోతుందని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు విమర్శలు గుప్పించారు. పంట నష్టపోయిన రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడటం దురదృష్టకరమన్నారు. గుంటూరు జిల్లాలో లక్షల ఎకరాలలో పంట నష్టపోయి.. రైతలు రోడ్డన పడ్డా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. నివర్ తుపాను కారణంగా రంగు మారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని ఆరోపించారు.
రైతులు బాధలు సీఎంకు తెలుసా? : దేవినేని ఉమా
సీఎం జగన్ మొద్దు నిద్ర వీడి కళ్లు తెరిచి.. రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పంట నష్టపోయి రైతులు రోడ్డున పడ్డారని.. రైతుల బాధలు సీఎంకు తెలుసా అని ప్రశ్నించారు. వైకాపా నాయకుల కోసమే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వం చేతకానితనం వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతన్నలకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని దేవినేని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: