take steps to prevent attacks on SCs and STs: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం, వరుస అఘాయిత్యాలపై సమగ్ర విచారణకు ఓ కమిషన్ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం నేతలు గవర్నర్‌ను కోరారు. జగన్మోహన్ రెడ్డి అండగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను నివారించే చర్యలు తీసుకోవాలని రాజ్ భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీ ఎన్ఆర్ఐ ఇన్ఛార్జ్ పంచ్ ప్రభాకర్ ఎస్సీ, ఎస్టీలను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలను నేతలు గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ-ఎస్టీల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని.. వివిధ ఘటనలకు సంబంధించిన నివేదికలను గవర్నర్‌కు అందజేశారు.
ఎస్సీ-ఎస్టీల రక్షణకు రాజ్యాంగం కల్పించిన హక్కులు సాధించే దిశగా జోక్యం చేసుకోవాలని గవర్నర్‌కు టీడీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. డీజీపీ సహా ప్రభుత్వ పెద్దలకు ఎన్నోమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని నేతలు పేర్కొన్నారు. న్యాయస్థానాలను కించపరిచిన పంచ్ ప్రభాకర్ ను తక్షణమే అరెస్టు చేసి తీసుకొచ్చేలా రాజ్యాంగ సంస్థలను ఆదేశించాలని కోరారు. నూటికి 75శాతం ఓట్లేసి గెలిపించిన ఎస్సీ, ఎస్టీలను జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా చూస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డికి చట్టబద్ధంగా లభించిన హక్కు అనేలా.. ఎస్సీ, ఎస్టీల పైనే హత్యలు, హత్యాచారాలు, శిరోముండనాలు చేయిస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితజాతిని ఇష్టం వచ్చినట్లు తిట్టిన పంచ్ ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి బంధువని, వైసీపీకి చెందిన ఎస్సీ, ఎస్టీ నేతలు ఎందుకు ఉపేక్షిస్తున్నారంటూ ప్రశ్నించారు.
రాజ్యాంగబద్దంగా అంబేద్కర్ దళితులకు కల్పించిన హక్కులు సైతం సీఎం జగన్ కాలరాశాడని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీల ఆత్మాభిమానంతో ఆడుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పేందుకు జాతి మొత్తం ఎదురు చూస్తోందని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన సీఐ ఆనందరావు ఆత్మహత్యతో పాటు అనేక అంశాలను.. గవర్నర్‌కు నివేదించామని నేతలు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలను ఎందుకు పంచ్ ప్రభాకర్ రెడ్డితో తిట్టిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాల, మాదిగలంటే సీఎంకు ఎందుకంత ఈర్ష్య, ద్వేషం, పగ అని నిలదీశారు. పంచ్ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారా అని గవర్నర్ అడిగారని తెలిపారు. ఇలానే హైకోర్టు జడ్జిలను కూడా పంచ్ ప్రభాకర్ తిట్టిన విషయాన్ని గవర్నర్ దృష్టి కి తీసుకెళ్తే ఆయన ఆశ్చర్యపోయారన్నారు. అంశాన్ని సీబీఐ దర్యాప్తు చేస్తున్నా, ఇంకా అరెస్టు కాకపోవటానికి సీఎం జగన్ కారణమని అబ్దుల్ నజీర్ కు వివరించామని నేతలు తెలిపారు.