TDP Leaders in Kanthi Tho Kranthi Program: చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన ‘కాంతితో క్రాంతి’ కార్యక్రమానికి ఊరూ, వాడా ప్రమిదలు వెలిగించారు. కొవ్వొత్తులతో కాంతులు నింపారు. కాగడాలు చేతపట్టి గర్జించారు. శనివారం రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల మధ్య విద్యుద్దీపాలు ఆపి, ఇళ్ల నుంచి బయటకొచ్చి దీపాలు వెలిగించారు. ప్రయాణాల్లో ఉన్న వారు సైతం.. ఎక్కడికక్కడే వాహనాల లైట్లు వెలిగించి ఆర్పుతూ నిరసన తెలియజేశారు. ‘కాంతితో క్రాంతి’ హ్యాష్ ట్యాగ్‌కు వేలాదిమంది నెటిజన్ల నుంచి మద్దతు లభించడంతో.. ఎక్స్‌లో దేశస్థాయిలో ట్రెండింగ్‌లో నిలిచింది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిల్లీలో కొవ్వొత్తులు వెలిగించి నిరసనలో పాల్గొన్నారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పాల్గొని మద్దతు ప్రకటించారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రాజమహేంద్రవరంలో ప్రమిదలు వెలిగించారు. మేము సైతం బాబు కోసం అంటూ ఈ సందర్భంగా మహిళలు పెద్దఎత్తున నినదించారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం ముఖ్య నేతలు కాగడాలను చేతపట్టి.. నిరసనలో పాల్గొన్నారు. నారా బ్రాహ్మణి హైదరాబాద్‌లో దీపాలు వెలిగించి.. నిరసన తెలియ జేశారు.
చంద్రబాబు నిజాయతీగా రాజకీయాలు చేసిన పున్నమి చంద్రుడని.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చాక రాష్ట్రంలో వెలుగులు నింపాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. చంద్రబాబును అరెస్టు చేసి 29 రోజులైంది.. ఏమైనా ఆధారాలు సంపాదించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తల కష్టంతో నడిచే పార్టీ టీడీపీ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వైసీపీ చేస్తున్న అవినీతిని ప్రశ్నించడమే చంద్రబాబు నాయుడు చేసిన తప్పా అంటూ ధ్వజమెత్తారు.
"చంద్రబాబు జీవితం ఒక తెల్ల కాగితం. చంద్రబాబు జీవితం ఒక తెరచిన పుస్తకం. మీరు ఎన్ని అవినీతి మరకలు అంటించినా చంద్రబాబుకు అంటవు. మీరు ఒక సారి చరిత్ర చూడండి.. ఎవరైనా ఒక నాయకుడు అవినీతి కేసులో అరెస్టు అయితే అతని అవనీతి బయటపడుతుంది. కానీ చంద్రబాబు అరెస్టు అయితే.. గత 29 రోజుల నుంచి ఆయన చేసిన అభివృద్ధి బయటపడుతుంది". - అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఎన్టీఆర్ భవన్‌లో పార్కింగ్ లో కార్ల లైట్లు బ్లింక్ చేస్తూ.. నిమ్మల రామానాయుడు, గద్దె రామ్మోహన్, దేవినేని ఉమా, నక్కా ఆనంద్ బాబు, పీతల సుజాత, అశోక్ బాబు, పంచుమర్తి అనురాధ, జీవీ ఆంజనేయులు, వర్ల, తదితరులు చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించిన జగన్ అంతకంతకూ అనుభవిస్తారని హెచ్చరించారు.
విజయవాడలో పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు మొబైల్ లైట్ వేసి చంద్రబాబుకు మద్దతు తెలిపారు.పశ్చిమ నియోజకవర్గం వన్ టౌన్ తారాపేట కూడలిలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కృష్ణా జిల్లా పెడనలో కాగిత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
అవనిగడ్డ, మొవ్వలో కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. గన్నవరంలో కొనకళ్ల నారాయణ నిరసన తెలిపారు. ఉయ్యూరులోనూ నిరసనలు కొనసాగాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పేటలో కాగడాల ప్రదర్శన చేశారు. చందర్లపాడు మండలం తుర్లపాడులో మహిళలు సామూహిక కొవ్వొత్తుల నిరసన ర్యాలీ నిర్వహించారు.