మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని బలవంతంగా జైలుకు తరలించడాన్ని నిరసిస్తూ గుంటూరు జిల్లా తెదేపా కార్యాలయం వద్ద ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి నుంచి జైలుకు తరలించే వ్యవహారం మొత్తం ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా పర్యవేక్షించిందని మాజీమంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు.
ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా అచ్చెన్నాయుడిని జైలుకు తరలించటం కక్షపూరిత చర్యగా ఆయన మండిపడ్డారు. వీల్ చైర్లో బయటకు తీసుకురావటం, అంబులెన్సులో తరలించటం చూస్తే ఆయన ఆరోగ్య పరిస్థితి తెలిసిపోతుందన్నారు.
జీజీహెచ్ వైద్యులతో వేసిన కమిటీ బూటకమని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు విమర్శించారు. కమిటీ నివేదిక పేరుతో అచ్చెన్నాయుడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి జైలుకు పంపారని ఆరోపించారు.
అచ్చెన్నాయుడు అరెస్టు విషయం ప్రభుత్వ దుర్మార్గ వైఖరికి నిదర్శనం అని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. 40ఏళ్లు రాజకీయల్లో ఉన్న కుటుంబానికి రక్షణ లేకపోతే సామాన్యులకు రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అన్ని రకాలుగా ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని... దానిపై ప్రశ్నించినందుకు అచ్చన్నాయుడుపై కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి: అచ్చెన్నాయుడి ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటం: చంద్రబాబు