TDP YANAMALA FIRES ON CM JAGAN : వైద్య రంగాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. సరైన మౌలిక సదుపాయాలు లేక ప్రభుత్వాసుపత్రులు నరకకూపాలుగా మారాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైద్య రంగంలో విప్లవం అనేది ముఖ్యమంత్రి మాటలకే పరిమితమైందని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో కీలకమైన విద్యా, వైద్య రంగాలు తిరోగమనంలో పయనిస్తున్నాయని యనమల ఆక్షేపించారు. నాడు-నేడు కింద వైద్య రంగం అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రచార ఆర్భాటం చేస్తున్న జగన్.. ఆచరణలో మాత్రం ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసి జే ట్యాక్స్ వసూళ్ల పైనే దృష్టి పెడుతున్నారని ఆరోపించారు. నేషనల్ హెల్త్ మిషన్ నిధులను దారి మళ్లించడం దేనికి సంకేతమని నిలదీశారు. పేదలన్నా.. వారి ఆరోగ్యమన్నా ముఖ్యమంత్రికి లెక్క లేదని విమర్శించారు.
సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ నివేదిక ప్రకారం పేదలకు ప్రాథమిక వైద్యం అందించడంలో దేశవ్యాప్తంగా ఏపీ 23వ స్థానానికి దిగజారడం ఆరోగ్య రంగంపై జగన్ చిత్తశుద్ధిని తెలియజేస్తోందని ఆక్షేపించారు. దేశంలోనే అత్యున్నత వైద్య ప్రమాణాలు ఏపీలో ఉన్నాయని చెబుతున్న ముఖ్యమంత్రి.. ఆస్పత్రుల్లో సూది మందు , సిరంజి, జ్వరం బిళ్లలు దొరకని పరిస్థితి ఎందుకు ఉందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడిచే సామాజిక, ప్రాథమిక ఆస్పత్రుల్లో రోగులకు పట్టెడన్నం దొరకని పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో వారు భోజనాలు పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య రంగంలో 40 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామంటున్న ముఖ్యమంత్రి మాటలే నిజమైతే.. ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది కొరతకు కారణాలేంటనీ నిలదీశారు.
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో 100 పడకల ప్రభుత్వాసుపత్రిలో నలుగురు వైద్యులు కూడా అందుబాటులో లేరంటే ఇక రాష్ట్రమంతటా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని యనమల ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీ ని అనారోగ్యశ్రీగా మార్చేశారని విమర్శించారు.
ఇవీ చదవండి: