కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. అన్న క్యాంటీన్లు ప్రారంభించకుండా మద్యం షాపులు తెరవడం సిగ్గుచేటన్నారు. మద్యం తాగే వారి బలహీనతను అడ్డుపెట్టుకుని పేదలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. కరోనా వ్యాప్తికి వైకాపా ప్రభుత్వం గేట్లు తెరిచిందన్నారు. 41 రోజుల శ్రమ మద్యం దుకాణాలు తెరవడంతో పోయిందని పేర్కొన్నారు.
మద్యం రేట్లను ఇష్టానుసారంగా పెంచి పేదవారి పొట్టకొడుతున్నారని జీవీ ఆరోపించారు. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను మద్యం షాపులు వద్ద క్యూ లైన్లు నివారించడానికి వాడుకోవడం హేయమైన చర్యని దుయ్యబట్టారు. కరోనా విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడంపైన ఉన్న శ్రద్ద.. కరోనా వైరస్ ను నివారించడంలో ఉంటే బాగుండేదని హితువు పలికారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో ఇంటి ఇంటికి పరీక్షలు నిర్వహించాలని.. అన్న క్యాంటీన్లను తెరచి పేదలను ఆదుకోవాలిని సూచించారు. మద్యం షాపులను మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: నీట్, జేఈఈ పరీక్షల తేదీలు ప్రకటన