TDP leader blames YSRCP: రాష్ట్రంలోని రైతు సమస్యలపై టీడీపీ నేతలు స్పందించారు. అధికార పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల రైతాంగం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గరపడ్డాయని పేర్కొన్నారు. వ్యవసాయ మంత్రికి రైతుల సమస్యలపై స్పందించడం కన్నా.. సీబీఐ కేసులపై శ్రద్ధను కనబరుస్తున్నారంటూ టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు.
రైతుల సమస్యలు, రాష్ట్ర వ్యవసాయ రంగంపై రూపొందించిన నివేదికను వ్యవసాయశాఖ కమిషనర్‌కు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. విత్తనాలు మొదలు ఎరువుల వరకు ఏవీ అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. వ్యవసాయ మంత్రికి తనపై ఉన్న సీబీఐ విచారణతో, రైతుల గురించి పట్టించుకునే తీరిక లేదని ధ్వజమెత్తారు. మైక్రో ఇరిగేషన్, మైక్రో న్యూట్రియంట్స్ పంపిణీ, ఇన్పుట్ సబ్సిడీని ఎందుకు నిలిపేశారని ప్రశ్నించారు.
గత టీడీపీ ప్రభుత్వం రైతులకు అమలు చేసిన పథకాలేవీ ఉండకూడదని ఆపేశారా అని నిలదీశారు. మిరప, పత్తి రైతులు నల్లి పురుగు, గులాబి పురుగుతో నష్టపోతే, ఇంతవరకు పంట నష్టం అంచనా వేయలేదని దుయ్యబట్టారు. రైతు భరోసా సాయంపై వాస్తవాలతో ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యాగారంగా పిలువబడే రాష్ట్రం నేడు వ్యవసాయం చేయలేని పరిస్థితికి వచ్చిందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ తలతిక్క నిర్ణయాలతో రాష్ట్ర రైతాంగం దిక్కుతోచని స్థితిలో విలవిల్లాడుతోందని విమర్శించారు. రైతు గెలవాలి-వ్యవసాయం నిలవాలన్న చంద్రబాబు సంకల్పానికి అనుగుణంగా రైతులతో చర్చించి ప్రణాళికలు తయారుచేశామని తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. నల్లి, గులాబి పురుగుతో నష్టపోయిన మిర్చి, పత్తి రైతులతో ఫిబ్రవరి2న చిలకలూరిపేటలో రచ్చబండ నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు.
'2018లో దేశంలో నంబర్‌వన్‌గా నిలిచిన మైక్రో ఇరిగేషన్‌ను ఎందుకు మూసేశారు. మా టైంలో ఎకరా వరికి పెట్టుబడి 18వేల రూపాయలు. ఇప్పుడు రూ. 35వేలు అవుతున్నాయి. భూసార పరీక్షలను ఆపేశారు. ప్రభుత్వంపై రైతులు తిరగబడే రోజు దగ్గరకు వచ్చింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రైతులకోసం తీసుకువచ్చిన ప్రతి పథకాన్ని మీరు తీశారు.'- సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి
ఇవీ చదవండి: