TDP Press Release On Women Welfare: గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు సాధికార సంక్షేమాన్ని అమలు చేస్తే.. ఇప్పుడు జగన్ మోసకారి సంక్షేమాన్ని అమలు చేస్తున్నారని ఆ పార్టీ ధ్వజమెత్తింది. జగన్ అమలు చేస్తున్నవి నవరత్నాలు కాదని, అవి నవ మోసాలని వెల్లడించింది. గత, ప్రస్తుత ప్రభుత్వాల హయాంలో మహిళలకు అమలైన పథకాల తీరుతెన్నులను విశ్లేషించి 9 అంశాలతో టీడీపీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
అమ్మ ఒడి - నాన్న బుడ్డీ: వైఎస్సార్సీపీ హయాంలో అమ్మఒడికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ అందులోనూ రూ. 2 వేలు కోత పెట్టి రూ. 13 వేలకు కుదించారని టీడీపీ ధ్వజమెత్తింది. నాన్న బుడ్డీ పేరుతో ఏడాదికి ఒక్కొక్కరి నుంచి రూ.70 వేలు గుంజేసుకుంటున్నారని మండిపడ్డారు. నాసిరకం మద్యం వల్ల 81 మంది ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంట్లోని ఇద్దరు బిడ్డలకు అమ్మఒడి కింద రూ. 30 వేలు ఇస్తామని జగన్ సతీమణి భారతీరెడ్డి ప్రచారం చేశారని గుర్తు చేసింది. ఆ లెక్కన 82 లక్షల మంది పిల్లలకు ఇవ్వాల్సి ఉండగా.. 42 లక్షలకు కుదించారని విమర్శించింది. టీడీపీ హయాంలో ఇంటర్ విద్యార్థులకు బోధనా రుసుములు అందించామని నినదించింది. ప్రతిభ అవార్డుల కింద ఇంటర్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, రూ.20 వేలు ఇచ్చాం. బెస్ట్ ఎవైలబుల్ పాఠశాలల కింద డే స్కాలర్స్‌కు రూ.20 వేలు, హాస్టల్ విద్యార్థులకు రూ.40 వేలు అందించాం. పాఠశాల విద్యార్థులకు ప్రతిభ అవార్డుల కింద రూ.20 వేలు ఇచ్చాం. వీటన్నింటినీ జగన్ రద్దు చేసి వాటి స్థానంలో అమ్మఒడి అనే కొత్త పేరు పెట్టారు.
ఆసరా కాదు టోకరా: వైఎస్సార్సీపీ డ్వాక్రా సంఘాల్లో మొండి బకాయిలున్న 25శాతం మంది మహిళలకే ఆసరా పేరుతో లబ్ధి చేకూరుస్తున్నారని, సకాలంలో రుణాలు చెల్లించిన 75శాతం మందికి టోకరా వేశారని ఆరోపించారు. నాలుగేళ్లలో 19 వేల కోట్లు ఇచ్చి ధరలు పెంచి ఇచ్చిన దానికన్నా ఎక్కువగానే గుంజుతున్నారని మండిపడింది. డ్వాక్రా సంఘాలకు 10 లక్షల వరకు సున్నా వడ్డీ రాయితీ ఇస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చి జగన్ మాట తప్పారని, దాన్ని 3 లక్షలకు కుదించారని టీడీపీ మండిపడింది. టీడీపీ ప్రభుత్వంలో డ్వాక్రా రుణమాఫీ, పసుపు-కుంకుమ, వడ్డీ రాయితీ కింద 21 వేల కోట్లు లబ్ధి చేకూర్చామని తెలుగుదేశం గుర్తుచేసింది. రుణమాఫీ ద్వారా 8వేల 500 కోట్లు, పసుపు-కుంకుమ ద్వారా 10 వేల కోట్లు, వడ్డీ రాయితీ కింద 2వేల500 కోట్లు అందించామని తెలిపింది. సున్నా వడ్డీ 5 లక్షల వరకు వర్తింప చేశామని, దీంతో ప్రతి సంఘానికి 50 వేల వరకు లబ్ధి చేకూరిందని గుర్తు చేసింది.
45 ఏళ్లకే పింఛను హామీకి ఎగనామం: వైఎస్సార్సీపీ ప్రభుత్వం 45 ఏళ్లకే పింఛను ఇస్తాననే హామీకి ఎగనామం పెట్టిందని టీడీపీ దుయ్యబట్టింది. ఒక్కో మహిళలకు 1.05 లక్షలు అందకుండా చేశారని మండిపడింది. వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్య నిషేధానికి నీళ్లు వదిలేసి,మద్యం ధరల్ని భారీగా పెంచేసిందని ఆక్షేపించింది. జే బ్రాండ్స్‌ను తీసుకొచ్చి మహిళల తాళిబొట్లను తెంచుతున్నారని మండిపడింది. కేవలం మద్యం ద్వారానే 3 ఏళ్లలో తాడేపల్లి ప్యాలెస్ 31 వేల కోట్లు లూటీ చేసిందని దుయ్యబట్టింది. 1,05,000 కోట్లు ప్రజల నుంచి పిండుకున్నారని, పేదలు తమ సంపాదనంతా మద్యానికే ధారపోస్తున్నారని ఆక్షేపించింది.
మద్యంతో మంట కలుస్తున్న మాంగళ్యాలు : టీడీపీ హాయంలో మద్యం ధరల్ని అదుపులో పెట్టడంతో పాటు గంజాయి, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపామని తెలిపింది. అప్పట్లో మద్యం ద్వారా ఆదాయం 6 వేల 400 కోట్లేనని గుర్తుచేసింది.
గృహ నిర్మాణం పేరుతో ప్రజలు అప్పులపాలు: వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడేళ్లలో పేదలకు నిర్మించిన ఇళ్లు 64 వేలు మాత్రమేనని, స్థలాలు కూడా ఎక్కడో ఊరికి దూరంగా, కొండలు, గుట్టలు, శ్మశానాల దగ్గర కేటాయించారని టీడీపీ ఆక్షేపించింది. ఇళ్ల స్థలాల కొనుగోలులో 7 వేల కోట్ల రూపాయలు కుంభకోణానికి పాల్పడ్డారని ధ్వజమెత్తింది. 11 వేల ఎకరాల ఎసైన్డ్ భూముల్ని కబ్జా చేశారని ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇంటికి ఇచ్చే ఆర్థిక సాయం సున్నా అని దుయ్యబట్టింది. టీడీపీ ఐదేళ్లలో 12 లక్షల గృహాల్ని నిర్మించిందని,ఒకటిన్నర సెంటు నుంచి 2 సెంట్ల పట్టా మంజూరు చేశామని గుర్తుచేసింది. పేదల ఇళ్ల నిర్మాణానికి సొంతంగా రాష్ట్ర ప్రభుత్వమే 1.50 లక్షలు రూపాయలు ఇచ్చిందని,భూమి కొనుగోలు పథకం కింద 6 వేల ఎకరాల పట్టా భూముల్ని పంపిణీ చేశామని స్పష్టంచేసింది.
సమస్యల వలయంలో అంగన్వాడీలు: వైఎస్సార్సీపీప్రభుత్వం ఆదాయ పరిమితి నిబంధన తీసుకొచ్చి అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాలను కోత వేశారని టీడీపీ మండిపడింది. ఇళ్ల పట్టాలు, ఇంటి నిర్మాణ రాయితీకి మంగళం పాడారని దుయ్యబట్టింది. టీడీపీ హాయంలో అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాల వర్తింపులో ఆదాయ పరిమితి నిబంధన నుంచి వెసులుబాటు కల్పించామని గుర్తుచేసింది. 4వేల200గా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాన్ని 10వేల 500కు పెంచామని తెలిపింది. ఆయాల వేతనాన్ని 2,950 నుంచి 6 వేల రూపాయలకు పెంచామని స్పష్టంచేసింది. ఆశా కార్యకర్తలు 3 వేలు వేతనం, మరో 3 వేలు ప్రోత్సాహకంగా అందించామని తెలిపింది.
ఈబీసీ నేస్తం - ఇచ్చేది గోరంత దోచింది కొండంత: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈబీసీ నేస్తం కింద ఇప్పటివరకు అగ్ర కులాల్లోని మహిళలకు రెండు విడతల్లో 30 వేలు చొప్పున ఇచ్చారని,కానీ నిత్యావసరాల ధరల్ని పెంచి ఒక్కో కుటుంబం నుంచి 1.08 లక్షలు కొట్టేశారని టీడీపీ ఆరోపించింది. ఒక్కో కుటుంబంపై తలసరి అప్పు 2 లక్షలకు పెంచారని మండిపడింది.
దిశ యాప్ పేరుతో ఆర్భాటపు ప్రచారం: గన్ కంటే ముందు జగన్ వస్తారని దిశ యాప్ పేరుతో ఆర్భాటపు ప్రచారం చేశారని మండిపడింది. కానీ మూడున్నరేళ్ల పాలనలో మహిళలపై 52,503 నేరాలు జరిగాయని టీడీపీ ఆరోపించింది. ముఖ్యమంత్రి నివాస ప్రాంతంలోనే వరస అత్యాచారాలు జరిగినా కట్టడికి చర్యలు లేవని ఆగ్రహాం వ్యక్తంచేసింది. తాడేపల్లి డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు కేంద్రంగా మారిందని ఆరోపించింది. కొందరు వైఎస్సార్సీపీ మంత్రులు, శాసనసభ్యులే మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డా,ఎలాంటి చర్యలు లేవని ఆవేదన వ్యక్తంచేసింది.
రాజధాని అమరావతి మహిళలపై నిందలు, దాడులు చేస్తూనే ఉన్నారని,లేని దిశ చట్టం పేరు చెప్పి మహిళల్ని మోసం చేస్తున్నారని టీడీపీ ఆక్షేపించింది. టీడీపీ పిడుగురాళ్లలో హత్యాచార ఘటనపై తక్షణం స్పందించిందని,పోలీసుల గాలింపునకు భయపడి నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తుచేసింది. మహిళలకు రక్షణగా షీ టీమ్‌లు ఏర్పాటు చేశామని,నేరాల కట్టడికి కఠిన చర్యలు తీసుకున్నామని స్పష్టంచేసింది. రాజధాని అమరావతి మహిళలను చీర, సారె ఇచ్చి గౌరవించామని తెలిపింది.
చెల్లెమ్మలకు రక్షణ లేదు: జగన్‌రెడ్డి నాలుగేళ్ల పాలనలో రాష్ట్రం నేరాలకు అడ్డాగా మారింది. 991 హత్యలు జరిగాయని, 202 పోక్సో కేసులు నమోదయ్యాయని,మహిళలకు రక్షణ లేదని టీడీపీ వాపోయింది.
ఇవీ చదవండి: