TDP Atchannaidu Comments on CM Jagan: డబ్బు, అధికారం అండతో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ పదేళ్లుగా జగన్ బెయిల్‌పై ఉన్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అచ్చెన్న మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి అవినీతిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఒకప్పుడు పేదరికంలో ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం.. దోపిడీతో 5లక్షల కోట్ల రూపాయలు ఆర్జించిందని ఆరోపించారు. 2003లో వైఎస్ కుటుంబం 9.19 లక్షల రూపాయలకు ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసిందని.. 2004 ఎన్నికల సమయంలో డబ్బులు లేక అవస్థలు పడిందని తెలిపారు. ఎన్నికల సమయంలో డబ్బులు లేక వైఎస్ఆర్కు ఉన్న ఒకే ఒక్క ఇల్లు అమ్మకానికి సిద్ధపడ్డారని అచ్చెన్నాయుడు అన్నారు.
నా ఎస్సీ, ఎస్టీలు అంటూనే వాళ్లపై జగన్ దాడులు చేస్తున్నారు: అచ్చెన్నాయుడు
ఎన్నికల వేళ వైఎస్‌ఆర్ పాదయాత్ర చేసి ప్రజలను మభ్యపెట్టారని.. 2004లో వైఎస్‌ఆర్ అధికారంలోకి వచ్చాక.. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్ లక్ష కోట్ల రూపాయలు సంపాదించారని విమర్శించారు. కొద్ది కాలంలోనే దేశంలోనే అత్యంత సంపన్నుడిగా తయారయ్యారని.. ప్రజల ధనం దోపిడీ చేసి జగన్ మోహన్ రెడ్డి ఈ స్థాయికి వచ్చారని అన్నారు. జగన్పై.. క్విడ్‌ప్రోకో కింద సీబీఐ 11 కేసులు నమోదు చేసిందన్న అచ్చెన్న.. 8 ఛార్జ్‌షీట్లు దాఖలు చేసి 45 వేల కోట్ల రూపాయల ఆస్తులను సీబీఐ అధికారులు సీజ్ చేసినట్లు తెలిపారు.
ఆ తర్వాత ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారని.. అవినీతిని చట్టబద్ధం చేసేందుకు తన అధికారాన్ని వాడుకున్నారని ఆరోపించారు. జగన్ సీఎం అయ్యాక.. నాలుగున్నరేళ్ల కాలంలో 4 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని అచ్చెన్న చెప్పారు.
ప్రజల ధనం దోపిడీ చేసి ఈ స్థాయికి వచ్చారని.. జగన్, ఆయన కుటుంబం దోపిడీపై పిల్ వేస్తే హైకోర్టు నోటీసులు కూడా ఇచ్చిందని పేర్కొన్నారు. లక్షల కోట్ల రూపాయలు దోచిన జగన్‌రెడ్డి.. పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారని.. జగన్ బెయిల్ రద్దు చేయాలని వైసీపీ ఎంపీనే సుప్రీంలో పిటిషన్ వేశారని అన్నారు. జగన్ అవినీతిపై సాక్ష్యాధారాలతో చెప్పినా ఆయన ఏనాడు జవాబు చెప్పలేదని విమర్శించారు.
డబ్బు, అధికారం అండతో వ్యవస్థలను జగన్ మేనేజ్ చేస్తున్నారన్న అచ్చెన్న.. పిక్ పాకెట్ కేసులో కూడా కోర్టుకు వెళ్లకుంటే వారెంట్ ఇస్తారని.. కానీ లక్షల కోట్లు దోచుకున్న జగన్ మాత్రం.. సంవత్సరాల తరబడి కోర్టుకు వెళ్లడం లేదని అన్నారు. రాష్ట్రంలోని భూములను జగన్ తన సొంత మనుషులకు అప్పగించారని.. సహజవనరులను ఇష్టానుసారంగా కొల్లగొడుతున్నారని అచ్చెన్న మండిపడ్డారు. జగన్, విజయసాయిరెడ్డి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని.. దోపిడీ సొమ్ముతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.
21 బీసీ కులాల భౌగోళిక పరిమితులు రద్దు - సీఎం జగన్ బీసీల ద్రోహి: అచ్చెన్నాయుడు