Tabs Distribution with Byjus Content in Andhra Pradesh: బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లు ఇచ్చామని జగన్ ప్రభుత్వం రాజకీయంగా ప్రచారం చేసుకుంటుందే తప్ప విద్యార్థుల పరిస్థితి పట్టించుకోవడం లేదు. వాడాల్సిందేనని ఒత్తిడి చేస్తోంది. పిల్లలు వాటిని సక్రమంగా వినియోగిస్తున్నారా? సందేహాలు నివృత్తి వ్యవస్థ ఉందా? మరమ్మతులకు గురైతే సకాలంలో చేస్తున్నారా? వంటి విషయాలను గాలికొదిలేసింది.
విద్యార్థులకు ఇష్టం ఉంటే వినడం లేదంటే మూలనపడేయడమే. పాస్‌వర్డ్‌లను తొలగించి కొందరు విద్యార్థులు యూట్యూబ్ వీడియోలు, ఆన్‌లైన్ గేమ్‌లతో కాలక్షేపం చేస్తున్నారు. అధికారుల ఒత్తిడితో చాలా మంది విద్యార్థులు బైజూస్ పాఠాలు ఆన్‌చేసి వదిలేస్తున్నారంతే. గతంలో బైజూస్ పాఠాల నుంచి పరీక్షల్లో ప్రశ్నలు ఇచ్చేవారు. ఇప్పుడు టోఫెల్ తీసుకురావడంతో దీన్ని పూర్తిగా పట్టించుకోవడం మానేశారు.
ట్యాబ్‌ల బిల్లులకు బ్యాంకు గ్యారెంటీ - ఆ గుత్తేదారులపై సీఎం వల్లమాలిన ప్రేమ
Negative Impact of Byjus Content on Students Studies: తరగతి గది పాఠాలు, వర్క్‌బుక్‌లు, నోటు పుస్తకాల దిద్దడంపై ఉన్నతాధికారులు తనిఖీలు చేస్తున్నందున ఉపాధ్యాయులు వీటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. సాధారణంగా బైజూస్ పాఠాలపై ఏమైన సందేహాలు వస్తే ఆయా కంపెనీల ప్రతినిధులు ఆన్‌లైన్‌లో నివృత్తి చేస్తారు. విద్యార్థులు సందేహాంపై ఫోన్ చేస్తే సమయం ఇచ్చి ఆన్‌లైన్‌లో మాట్లాడతారు. ఇక్కడ అలాంటి విధానం లేదు. కేవలం కంటెంట్ వేసి, ఇవ్వడమే తప్ప అది విద్యార్థులకు ఎంత వరకు అర్థమైంది? వారి పరిస్థితి ఏంటి? అనే పరిశీలన లేదు. ప్రభుత్వం బైజూస్ కంటెంట్, ట్యాబ్‌ల పంపిణీని ఎన్నికల ప్రచారంగా భావిస్తుందే తప్ప పిల్లల ప్రయోజనాన్ని మదింపు చేయడం లేదు.
కరోనా తర్వాత ఆన్‌లైన్ చదువులకు డిమాండ్ తగ్గింది. అందుకే బైజూస్ వ్యాపారం తగ్గిపోయింది. ఆన్‌లైన్ చదువులతో విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయని, ఏకాగ్రత తగ్గిపోతుందని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఆన్‌లైన్ విద్య తరగతి ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం కాదని యూనిసెఫ్ వెల్లడించింది. కానీ, ప్రభుత్వం మాత్రం బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లు ఇచ్చి, విద్యార్థులను ఏదో ఉద్ధరిస్తున్నామని చెబుతోంది.
Pawan Tweet: ఏపీ పాఠశాల విద్యలో బైజూస్ యాప్‌ను చూపించి ప్రభుత్వం మోసం చేస్తోంది: జనసేన అధినేత
పాఠశాల స్థాయిలో టెక్నాలజీ వాడకాన్ని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తే ఫర్వాలేదు. పిల్లలపై పర్యవేక్షణ లేకపోతే టెక్నాలజీ గాడితప్పే పరిస్థితి ఉంది. ఒకవేళ ప్రభుత్వం విద్యార్థులకు అదనంగా చదువును అందించాలనుకుంటే ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా తరగతులు పెట్టించొచ్చు. సీబీఎస్ఈ సిలబస్‌కు సంబంధించిన చాలా వీడియోలను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఆన్‌లైన్‌లో ఉంచింది. వాటిని తరగతిలోనే పిల్లలకు వినిపించొచ్చు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు.
ట్యాబ్‌ల వినియోగం చాలాచోట్ల గాడి తప్పుతోంది. ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని ఓ పాఠశాల విద్యార్థి తల్లిదండ్రులు బైజూస్ ట్యాబ్ వెనక్కి ఇచ్చేస్తామని ప్రధానోపాధ్యాయుడి వద్దకు వచ్చారు. మరో విద్యార్థి యూట్యూబ్ వీడియోలు చూస్తుండడంతో, ఇక చూడకుండా ఉంటానంటూ పిల్లవాడితో ప్రధానోపాధ్యాయుడు హామీపత్రం రాయించుకున్నారు.
సత్యసాయి జిల్లా ధర్మవరంలో ట్యాబ్‌ల కారణంగా పిల్లలు చెడిపోతున్నారంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి ఓ విద్యార్థి తల్లి ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో విద్యార్థులు ట్యాబ్‌లో ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతుండడంతో స్థానికులు గుర్తించి పాఠశాలలో ఫిర్యాదు చేశారు. చదువులు మానేసి పిల్లలు ఏవేవో చూస్తున్నారని, ఇళ్లకు ట్యాబ్‌లను ఇవ్వొద్దని విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు అనకాపల్లి జిల్లాలో ఉపాధ్యాయులకు ఫిర్యాదులు చేశారు.
ట్యాబ్ "తెర" పై వివాదం.. పోటీ ఉంటే తక్కువ ధరకే వస్తాయంటున్న నిపుణులు
కొన్ని ట్యాబ్‌లు తరుచూ మరమ్మతులకు గురవుతున్నాయి. గుత్తేదారు మరమ్మతుల విషయంలో జాప్యం చేస్తున్నారు. మూడేళ్లు వారెంటీ ఉన్నా పట్టించుకోవడం లేదు. గ్రామ, వార్డు సచివాలయ డిజిటల్ సహాయకుడికి ఫిర్యాదు చేసినా అంతే. ప్రైవేటు యాప్‌లు వేసుకుంటున్న కొందరు ట్యాబ్‌లు చెడిపోయాయని చెప్పి బడులకు తీసుకురావడం లేదు. విజయనగరం జిల్లాలో గతేడాది 21వేల 448 ట్యాబ్‌లు పంపిణీ చేయగా, 12 వందల 41 ట్యాబ్‌ల్లో సాంకేతిక సమస్యలు వచ్చాయి.
అనకాపల్లి జిల్లా చోడవరం మండలానికి 960 ట్యాబ్‌లు ఇవ్వగా, కొన్నిచోట్ల ట్యాబ్‌లు పాడైతే విద్యార్థులే నేరుగా సెల్‌ఫోన్ మరమ్మతుల సెంటర్‌కు తీసుకువెళ్లి చేయించుకున్నారు. చోడవరం మండలంలో ఓ ఉన్నత పాఠశాలకు 108 ట్యాబ్‌లు ఇవ్వగా, 40శాతం పని చేయడం లేదు. భీమవరంలో ఓ ఉన్నత పాఠశాలలకు 84 ట్యాబ్‌లు ఇవ్వగా, వీటిల్లో 10 మరమ్మతులకు గురయ్యాయి. వైఎస్సార్ జిల్లాకు గతేడాది 19 వేల 699 ట్యాబ్‌లు ఇవ్వగా 15శాతం పని చేయడం లేదని అధికారులు తెలిపారు.
గతేడాది డిసెంబర్ 21న సీఎం జగన్ పుట్టిన రోజున విద్యార్థులు, ఉపాధ్యాయులకు కలిపి 5 లక్షల 18 వేల ట్యాబ్‌లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రజాధనంతో సీఎం జగన్ తన పుట్టిరోజు కానుకంటూ ప్రచారం చేసుకున్నారు. ఈ ఏడాది మళ్లీ సీఎం పుట్టినరోజున మరోసారి ట్యాబ్‌లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ట్యాబ్‌ల గుత్తేదార్లు, సకల శాఖ మంత్రి, కీలక మంత్రికి కమీషన్ల కోసమే తప్ప పిల్లలకు ఉపయోగపడుతోంది శూన్యమే అన్నది ఉపాధ్యాయుల మాట.