గుంటూరులో మండుటెండలు ఠారెత్తిస్తున్నాయి. గుంటూరుతోపాటు నరసరావుపేట, గురజాల, వినుకొండ, దుర్గి, మాచర్ల, రెంటచింతల ప్రాంతాల్లో వారం రోజులుగా ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే తీవ్రత పెరిగి... ప్రజలు బయటకు రావడానికే భయపడే పరిస్థితి నెలకొంది. ఉదయం 10 గంటలలోపు, సాయంత్రం 4 గంటలు దాటాక బయటకు వస్తున్నారు.
ప్రయాణికులు ఎండలోనే..
కొందరు ప్రయాణికులు మండుటెండల్లోనూ ప్రయాణిస్తున్నారు. ఉద్యోగులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఆటోడ్రైవర్లు.. ఇలా అన్నివర్గాల ప్రజలు విలవిల్లాడుతున్నారు. గుంటూరులో చాలా ప్రదేశాల్లో చెట్లు లేక ఎండలోనే ప్రయాణికులు బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మే మాసంలో ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది.
సర్వజనాస్పత్రి..!
వేసవి దాహార్తి దృష్ట్యా నగరపాలక సంస్థ గుంటూరులో 54 చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మజ్జిగ కేంద్రాలూ ఏర్పాటు చేస్తున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు సైతం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలో 10 లక్షల వరకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీకి సిద్ధమయ్యారు. వేసవిలో తాగునీటి పైపులు లీకేజయ్యే ప్రమాదముంది. గత వేసవిలో కలుషిత నీటితో గుంటూరులో 20 మంది వరకు మృతి చెందారు. తక్షణం చికిత్స అందించేందుకు వీలుగా గుంటూరు సర్వజనాస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు.
ఎండ తీవ్రత దృష్ట్యా పగటిపూట బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ రాకుండా తాగునీటిని వెంట తీసుకువెళ్లడం మంచిదని చెబుతున్నారు.