కొండలు అధిరోహించడం సులువేమీ కాదు. ఓపిక, పట్టుదల, శారీరక సామర్థ్యం ఉండాలి. అలాంటిది మహిళా దినోత్సవం రోజున ఒకేసారి 85 మంది విద్యార్థులు కొండవీడు కోటను అధిరోహించారు. ఎన్నో పర్వతాలు ఎక్కిన అనుభవమున్న యువ మౌంటైనర్, ఔట్ రైవల్ అడ్వంచర్ వ్యవస్థాపకురాలు దళవాయి ఆశ నేతృత్వంలో సామూహిక ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ ఎస్పీ కేజీబీ సరిత లాంఛనంగా ప్రారంభించారు. కఠిన పరిస్థితులను ఎదుర్కొంటామంటూ ముందుకు వచ్చిన విద్యార్థినులను ఆమె అభినందించారు.
ఉదయం ఏడున్నర గంటలకు ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. రెండున్నర గంటల్లో కొండ పైభాగానికి విద్యార్థులు చేరుకున్నారు. యువ మౌంటైనర్, ఔట్ రైవల్ అడ్వంచర్ సంస్థ వ్యవస్థాపకురాలు దళవాయి ఆశ వీరికి మార్గదర్శనం చేస్తూ ముందుకు నడిపించారు. విద్యార్థులు చదువుతోపాటు ఇలాంటి అడ్వంచర్ స్పోర్ట్స్ వైపు దృష్టి సారించాలని ఆమె కోరారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం, మానసిక, శారీరక ఉత్తేజానికి ట్రెక్కింగ్ ఉపయోగపడుతుందని ఆశ చెప్పారు.
గుంటూరులోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థినులు, ఎన్సీసీ కేడెట్లు, వారి తల్లిదండ్రులు సైతం తొలిసారిగా ట్రెక్కింగ్ అనుభావాన్ని ఎదుర్కొన్నారు. ఎత్తైన కొండలను ఎక్కుతూ.. చుట్టూ, కొండ దిగువున పరిసరాలను చూస్తూ విద్యార్థులు ఆహ్లాదంగా కొండను అధిరోహించారు. ఇదో మరపురాని అనుభవమని.. తమలో ఆత్వవిశ్వాసాన్ని నింపిందని విద్యార్థినులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: చదువుల తల్లి: పాఠాలతోనే నాన్నకు గుణపాఠం