ఏ భాషనైనా బాగా నేర్చుకోవాలంటే... తరచూ మాట్లాడటమే ఉత్తమ మార్గమనేది భాషా నిపుణుల అభిప్రాయం. ఇదే సూత్రాన్ని పాటిస్తూ గుంటూరు జిల్లా ఐలవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు... ఆంగ్లభాషలో నైపుణ్యం సాధిస్తున్నారు. స్కైప్ ద్వారా విదేశీ ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడుతూ భాషపై పట్టు సాధిస్తున్నారు. ఆయా దేశాల సంస్కృతి, సంప్రదాయాలు, విద్యావిధానం, ఆహార అలవాట్ల గురించి తెలుసుకుంటున్నారు. ఆసక్తిగా ఉన్నవాటిపై చర్చిస్తూ అవగాహన పెంచుకుంటున్నారు. అలాగే మన భాష, సంస్కృతుల గురించి వారికి తెలియజేస్తున్నారు. ఘనమైన భారతీయ వారసత్వ సంపద, ఇక్కడి చారిత్రక అంశాలను వివరిస్తున్నారు.
ఐలవరం పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న హరికృష్ణకు... విదేశీ ఉపాధ్యాయులతో పరిచయాలు పెంచుకోవడం, స్కైప్ ద్వారా మాట్లాడటం అలవాటు. ఈ విధానాన్ని విద్యార్థులకూ అలవర్చితే... వారిలో ఆంగ్లభాషా నైపుణ్యం పెరుగుతుందని భావించారు. అలా ఆయన చొరవతో రెండేళ్ల క్రితం 'పెన్ పాల్ స్కీం' ప్రారంభించారు. అప్పటి నుంచి ఇక్కడి విద్యార్థులు... తరచుగా విదేశీ ఉపాధ్యాయులు, విద్యార్థులతో స్కైప్ ద్వారా అనుసంధానమవుతున్నారు.
పెన్‌పాల్ స్కీం అమలుతో విద్యార్థుల్లో గొప్ప మార్పు కనిపించించిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. విదేశీయులతో పోటీగా మన విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడుతుంటే ఆనందంగా ఉందంటున్నారు.
పాఠశాలలో డిజిటల్ విద్యా బోధనా సౌకర్యాలను ఉపయోగించుకుని... చదువుతో పాటు ప్రాపంచిక విషయాలపైనా ఐలవరం విద్యార్థులు అవగాహన పెంచుకుంటున్నారు.
ఇదీ చదవండి: సైబర్ మోసగాళ్లను నమ్మితే... సర్వం సమర్పయామి..!