Students Suffering Due to non Release of Fee Reimbursement Funds: విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి వాటిని గత ప్రభుత్వాలు ఇవ్వలేదని.. విద్యార్థులకు తామే తొలిసారి ఇస్తున్నామని సీఎం జగన్ పదే పదే చెబుతుంటారు. అయితే ఆ పథకాలకు కోట్లాది రూపాయల బకాయిలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీయింబర్స్‌మెంట్ విషయంలోనూ విద్యార్థులను ప్రభుత్వం నట్టేట ముంచిందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో నిధులు జమచేయకపోవడంతో తాము ఫీజు చెల్లించలేకపోతున్నామని... చెల్లిస్తే గానీ యాజమాన్యాలు పరీక్షలకు అనుమతించడం లేదని చెబుతున్నారు.
విద్యార్థుల ఓట్ల కోసం జగన్నాటకం - ప్రభుత్వ సాయం ప్రత్యక్షంగా తెలియాలనే ఉమ్మడి ఖాతా
పరీక్ష ఫీజు చెల్లించేందుకు సైతం ట్యూషన్ ఫీజు చెల్లిస్తేనే అనుమతిస్తామని నిబంధన పెట్టారని, దీంతో తల్లిదండ్రులపై ఫీజుల భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా మూడు విడతలుగా రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇస్తున్నారని... దీనివల్ల ఫైనల్ ఇయర్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. గతేడాది ఫైనల్ ఇయర్ విద్యార్థులకు కోర్సు పూర్తయి ఈ ఏడాది మేలో బయటకు వెళ్లే సమయానికి రెండు విడతల బకాయిలున్నాయి. వాటిలో ఒక విడతను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. లబ్ధిదారుల్లో కోత విధించేందుకే ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏటా 20వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15వేలు, ఐటీఐ విద్యార్థులకు 10వేలు జమచేస్తామంటూ ప్రభుత్వం వసతి దీవెన అమల్లోకి తెచ్చింది. రెండు విడతలుగా తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రకటించింది. కానీ ఇచ్చిన హామీ ప్రకారం వసతి దీవెన అమలు చేయడం లేదు. ఏటా ఒక విడత మాత్రమే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వసతి దీవెన జమవుతోంది. ఇంజినీరింగ్ విద్యార్థులకు 10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 7,500, ఐటీఐ విద్యార్థులకు 5వేలు జమ చేస్తున్నారు.
డిగ్రీ విద్యార్థులకు ‘జగనన్న వసతి దీవెన’ కింద ఏడాదికి 20 వేలు చొప్పున మూడేళ్లకు 60 వేలు జమ చేయాల్సి ఉంది. కానీ ఏడాదికి రెండు విడతలు కాకుండా ఒకసారి మాత్రమే డబ్బులు బ్యాంకులో వేయడంతో ఇప్పటివరకు 30 వేలు మాత్రమే అందాయని విద్యార్థులు వాపోతున్నారు. ఐటీఐ విద్యార్థులకు వసతి దీవెన కింద ఏడాదికి 10 వేల రూపాయలు చొప్పున రెండేళ్లకు 20 వేలు చెల్లించాల్సి ఉండగా 10వేలు మాత్రమే జమ చేశారు. ఇలా పాలిటెక్నిక్ , డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు మూడేళ్లుగా ఒక విడత మాత్రమే జమ చేశారు. మిగిలినవి ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొందని విద్యార్థులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. వీటికి తోడు ‘విద్యా దీవెన’, ‘వసతి దీవెన’ పొందాలంటే సంయుక్త ఖాతా తెరవాలనే కొత్త నిబంధనతో.. కష్టాలు మరింత పెరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.