Statewide Draft Electoral Roll Special Drive on Day Two: రాష్ట్ర వ్యాప్తంగా ముసాయిదా ఓటర్ల జాబితా ప్రత్యేక డ్రైవ్ రెండో రోజూ కొనసాగింది. మార్పులు, చేర్పుల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఎన్నికల సంఘం తనిఖీలు నిర్వహించింది. మొదటిరోజుతో పోల్చితే రెండో రోజు ఓటర్లలో స్పందన పెరిగింది. ముసాయిదా ఓటరు జాబితాలో తవ్వేకొద్ది తప్పులే దర్శనమిస్తున్నాయి. చనిపోయిన వారి పేర్లు తొలగించలేదు. అధికారపార్టీ నాయకులకు ఒక్కొక్కరికి రెండు, మూడేసి ఓట్లు ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం రామచంద్రపురంలోని ఐదో పోలింగ్ బూత్‌లో ఏడు డెత్ ఓట్లను ఇంతవరకు తొలగించలేదు. కొంతమందికి రెండు చోట్ల ఓట్లు ఉన్న అంశాన్ని అధికారులకు ఫిర్యాదు చేసినా తొలగించలేదని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. విజయవాడలో ఓటర్ల ప్రత్యేక నమోదు కార్యక్రమం రెండో రోజూ కొనసాగింది. పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటర్ చైతన్య కార్యక్రమానికి కొత్త ఓటర్ల నుంచి స్పందన లభించింది. స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు ఉందో లేదో జాబితాలో పరిశీలించుకున్నారు. ఓట్లు గల్లంతైన వారు తిరిగి ఫారం- 6తో కొత్త ఓటుకు దరఖాస్తు చేసుకున్నారు. వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో కొందరికి రెండేసి ఓట్లున్నాయి. వీటిపై ప్రధాన పార్టీల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ దరఖాస్తు చేశారు.
Fake Votes in AP: వారం రోజుల్లో ఓటర్ల ముసాయిదా జాబితా.. అక్రమాలు పూర్తిగా సరిదిద్దకుండానే..!
ఎన్టీఆర్ జిల్లా నందిగామ పురపాలక సంఘం పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటర్ చైతన్య కార్యక్రమం నిర్వహించారు. నందిగామ డీపీఆర్ కాలనీలోని 107, 108, 109 పోలింగ్ కేంద్రాల్లో కొంతమందికి రెండు, మూడు ఓట్లు ఉన్నాయి. మరికొంతమందికి నందిగామ పోలింగ్ కేంద్రాలతోపాటు నియోజకవర్గంలోని గ్రామాల్లోనూ ఓట్లు ఉన్నాయి. నందిగామలో యువత ఓట్లకోసం దరఖాస్తు చేసుకున్నారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో 3వేలకు పైగా చనిపోయిన వారి పేర్లు జాబితాలో ఉన్నాయి. 2 వేలకుపైగా డబుల్ ఎంట్రీలు ఉన్నాయి.
నంద్యాల జిల్లా డోన్ వైసీపీ ఎంపీపీ రేగటి రాజశేఖరరెడ్డికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి. ఆయన సోదరులు చంద్రమౌళేశ్వర రెడ్డికి రెండు చోట్ల, రామేశ్వర రెడ్డికి మూడు చోట్ల ఓటు హక్కు ఉంది. వైసీపీకి చెందిన డోన్ మున్సిపల్ ఛైర్మన్ రాజేష్ భార్య సుమిత్ర పేరు మీద మూడు చోట్ల ఓట్లున్నాయి. ఛైర్మన్ తండ్రి తిమ్మయ్య పేరు మీద రెండు చోట్ల ఓటు హక్కు ఉంది. కేడీసీసీ ఛైర్మన్ సీమ సుధాకర్ రెడ్డికి రెండు చోట్ల ఓటు హక్కు ఉండగా ఆయన భార్య మనోహరమ్మకి రెండు చోట్ల, కుమారుడు సుబ్బారెడ్డికి మూడు చోట్ల ఓట్లు ఉన్నాయి. చనిపోయిన వారి ఓట్లు, డబుల్ ఎంట్రీలు తొలగించకపోవడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.