గుంటూరు జిల్లాలో...
గుంటూరు జిల్లా ఫిరంగిపురం సెయింట్ పాల్స్ ఆడిటోరియంలో వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి హాజరయ్యారు. ఎన్నికల సమయంలో చెప్పిన నవరత్నాలు అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. మహిళలకు రిజర్వేషన్ శాతం పెంచిన ఘనత జగన్మోహన్రెడ్డికి దక్కుతుందని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆసరా చెక్కులను పంపిణీ చేశారు.
కరోనా వైరస్ వ్యాపిస్తోందనీ.. భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని అధికారులు ప్రచారం చేస్తున్నా.. నిబంధనలకు విరుద్ధంగా ఈ కార్యక్రమానికి 3 వేల మందికి పైగా డ్వాక్రా మహిళలు హాజరయ్యారు. వైరస్ వ్యాప్తి చెందుతున్నా.. వేల మందితో ఆసరా కార్యక్రమం నిర్వహించటమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
విశాఖ జిల్లాలో...
సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడి.. డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేశారని ప్రభుత్వ విప్ బూడి బూడి ముత్యాలనాయుడు అన్నారు. విశాఖ జిల్లా దేవరాపల్లిలో వైయస్సార్ ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసరా పథకం ద్వారా లబ్ధిపొందిన మహిళలతో మాజీ ఎంపీపీ భాస్కరరావు భారీ ర్యాలీ నిర్వహించారు. రైవాడ గెస్ట్ హౌస్ వద్ద సీఎం జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు.
విజయనగరం జిల్లాలో...
విజయనగరం జిల్లా సాలూరు పట్టణం మున్సిపల్ కార్యాలయంలో వైఎస్సార్ ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజన్న దొర పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆడవారి పాలిట దేవుడని రాజన్న దొర అన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తామని.. మాట మార్చారని ఆరోపించారు.
బొబ్బిలిలో వైఎస్సార్ ఆసరా ముగింపు వేడుకలు కళాభారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని అన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన వైఎస్సార్ ఆసరా ముగింపు ఉత్సవాల్లో.. వైకాపా జిల్లా అధ్యక్షురాలు డాక్టరి కిల్లి కృపారాణి పాల్గొన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలకు ఆసరా చెక్కులను అందజేశారు. మహిళల అభ్యున్నతికి సీఎం జగన్ పాటుపడుతున్నారని కృపారాణి అన్నారు.
కృష్ణా జిల్లాలో...
కృష్ణా జిల్లా వత్సవాయి జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో వైఎస్సార్ ఆసరా వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా దివంగత నేత వైయస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతపురం జిల్లాలో...
అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశల కాన్ఫరెన్స్ హాల్లో వైఎస్సార్ ఆసరా వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్వాక్రా సంఘాల మహిళలు, మెప్మా సిబ్బంది పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సిద్ధారెడ్డి హాజరయ్యారు. కరోనా నిబంధనలు పాటించకుండా.. భౌతిక దూరం మరిచి, సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసేందుకు మహిళలు ఎగబడ్డారు.
కర్నూలు జిల్లాలో...
కర్నూలు జిల్లా ఆదోనిలో వైఎస్సార్ ఆసరా ముగింపు వారోత్సవాలను రెడ్డి కల్యాణ మండపంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఆదోనిలో కరోనా కేసులు రోజురోజుకి ఎక్కువ అవుతున్నా... అవేమీ పట్టనట్లు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో వారోత్సవాలు నిర్వహించటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లాలో...
ప్రజలంతా మెుక్కలు నాటి వాటిని సంరక్షించాలని రాప్తాపడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. చెన్నేకొత్తపల్లి సమీపంలో అటవీ ప్రాంతంలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని.. సీడ్ బాల్స్ వశారు. చెన్నేకొత్తపల్లిలో నిర్వహించిన ఆసరా కార్యక్రమంలో పాల్గొని డ్వాక్రా మహిళలకు చెక్కును అందజేశారు.
ఇదీ చదవండి: కరోనా కల్లోలం...సంక్షోభంలో క్రీడారంగం