NEW POST FOR SAMEER SHARMA : రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా సలహాదారులను నియమిస్తున్న ప్రభుత్వం.. తాజాగా వారికి కావాల్సిన అధికారుల కోసం కొత్త పోస్టులు కూడా సృష్టిస్తోంది. ఈ నెల 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్న ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ కోసం ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో కొత్త పోస్టును సృష్టిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సమీర్ శర్మను రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్ అఫీషియో చీఫ్ సెక్రటరీ హోదాలో నియమిస్తు ఆదేశాలు జారీ అయ్యాయి. సమీర్ శర్మ ఇంకా ఉద్యోగ విరమణ చేయకుండానే ఆయన కోసం కొత్త పోస్టును సృష్టిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
మరోవైపు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌గానూ సమీర్ శర్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవితో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ గానూ.. సమీర్ శర్మకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పీసీబీ చైర్మన్ హోదాలో మూడేళ్ల పాటు పదవిలో ఉంటారని ప్రభుత్వం పేర్కొంది. ఉద్యోగ విరమణ చేసిన వెంటనే ఒకేసారి రెండు కీలక పదవులు దక్కించుకున్న తొలి అధికారిగా సమీర్ శర్మ నిలిచారు.
మరోవైపు ప్రణాళికా విభాగం ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా ఉద్యోగ విరమణ చేయనున్న జీఎస్ఆర్ కేఆర్ విజయకుమార్కూ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పోస్టు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన్ను స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈఓగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రణాళికా విభాగం కార్యదర్శిగా ఉద్యోగ విరమణ చేసిన వెంటనే ఆయన స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈఓగా నియమితులు కానున్నారు.
ఇవీ చదవండి: