State Election Commissioner Asked Explanation on Employees Transfer: రాష్ట్రంలో అధికారులు, ఉద్యోగులు బదిలీలపై నిషేధం ఉన్న కూడా.. ప్రభుత్వం కొందరు ఉద్యోగులను బదిలీ చేయటంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సాధారణ పరిపాలన శాఖలోని సర్వీసెస్ విభాగ కార్యదర్శిని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివరణ కోరారు.
ఈ నెల 6వ తేదీన రాత్రి కొందరు ఉద్యోగులను ప్రభుత్వం బదిలీ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేయడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సీరియస్ అయ్యారు. సచివాలయంలోని సెక్షన్ అధికారులు, సహాయ సెక్షన్ అధికారులను కలిపి మొత్తం ఏడుగురు ఉద్యోగులను బదిలీ చేయగా.. దానిపై ఎన్నికల ప్రధానాధికారి ప్రభుత్వాన్ని వివరణ కోరారు. కాళహస్తి ఆర్డీఓ కేఎస్ రామారావును బదిలీ చేయటంపైనా ప్రభుత్వం నుంచి ఎన్నికల సంఘం వివరణ కోరింది.
ప్రభుత్వం బదిలీ చేసిన అధికారులు ఎన్నికల విధుల్లో ఉండటం వివాదానికి దారి తీసింది. రాష్ట్రంలో బదిలీలపై నిషేధం ఉన్నా.. ప్రభుత్వం ఎన్నికల విధుల్లోనున్న ఉద్యోగులను బదిలీ చేయటంపై.. ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని వివరణ కోరింది.
అధికారులు, ఉద్యోగులు బదిలీలపై నిషేధం : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఉద్యోగుల బదిలీలు, ఖాళీల భర్తీపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిషేధం విధిస్తూ ఉత్వర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితా పక్రియలో కీలకంగా వ్యవహరిస్తున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది బదిలీపై.. ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆదేశించారు.
తుది జాబితా రూపకల్పనలో భాగస్వాములైన అధికారుల, సిబ్బంది వివరాలు అందించాలని.. జిల్లా, మండల ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎన్నికల సంఘం నిషేధం విధించిన ఉద్యోగుల బదిలీల్లో.. ఎటువంటి ఉల్లంఘన జరిగినా అది ఎన్నికల ప్రవర్తన నియామవళి కిందకు వస్తుంది. ఒకవేళ ఎవరైనా ఉద్యోగులను తప్పనిసరి బదిలీ చేయాల్సి వస్తే.. ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఈ నెల 6వ తేదీ బదిలీలపై ప్రతిపక్షాలు: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బదిలీలపై నిషేధం విధించిన రోజే.. ఏడుగురు ఉద్యోగులను ప్రభుత్వం బదిలీ చేయటంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. నిషేధం ఉన్నా అధికారులను బదిలీ చేయటంపై అనుమానాలను వ్యక్తం చేశాయి. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి విచారణ జరిపి చర్య తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
కాళహస్తి ఆర్డీఓ కెఎస్ రామారావు బదిలీ: విజయవాడలోని దుర్గగుడి ఈవోగా పనిచేసిన భ్రమరాంబను అక్టోబరు 1వ తేదీన ప్రభుత్వం బదిలీ చేసింది. అనంతరం ఆమె స్థానంలో డిప్యూటి కలెక్టర్ స్థాయి అధికారి.. శ్రీనివాస్‌ను ప్రభుత్వం దుర్గ గుడి ఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఆయన విధుల్లో చేరకపోవటంతో.. కాళహస్తి ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్న కేఎస్ రామారావును అక్టోబర్ 6వ తేదీన నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.