పరిపాలన వికేంద్రీకరణ అంటే కార్యాలయాలు తరలించడం కాదని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు అన్నారు. అధికారాలను కింది స్థాయి వరకు వికేంద్రీకరించాలని అన్నారు. విశాఖ ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక రాజధానిగా ఉందని.... రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు పరిశ్రమలను తీసుకురావాలని సూచించారు. టీడీఎల్పీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు కార్యాలయాల తరలింపుతో ఉత్తరాంధ్ర, సీమకు ఒరిగేదేమీ లేదని రామానాయుడు అభిప్రాయపడ్డారు. ఒకే రాజధాని, ఒకే అసెంబ్లీ డిమాండ్‌కు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
అమరావతిని రాజధానిగా అసెంబ్లీలో తీర్మానం చేసి గెజిట్ విడుదల చేశామని గుర్తు చేశారు. సంఖ్యాబలం ఉందని రాష్ట్ర ప్రభుత్వం బిల్లులను ఆమోదించుకుంటే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. ప్రజాగ్రహం ముందు ఏ తీర్మానం, సంఖ్యాబలం నిలబడదని అన్నారు. అలాగే ఎన్నికల అజెండాలో లేకుండా రాజధానిని ఎలా మారుస్తారని వైకాపా సర్కార్‌ను ప్రశ్నించారు. రాజధాని మార్పుపై 175 నియోజకవర్గాల్లో రెఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ముగ్గురు వ్యక్తులు తీసుకునే నిర్ణయాలతో రాష్ట్ర భవిష్యత్తు అంధకారమవుతోందని దుయ్యబట్టారు. అలాగే జీఎన్‌రావు కమిటీకి చట్టబద్దత లేదని... ఆ నివేదిక చెల్లదని అన్నారు.
ఇదీ చదవండి: