బంగారం వ్యాపారానికి కేంద్ర బిందువుగా ఉన్న గుంటూరు జిల్లా మంగళగిరిలో అధిక సంఖ్యలో ఆభరణాల తయారీదారులు ఉన్నారు. మరికొందరు.. బంగారం ముడిసరకు ఇస్తే.. వాటిని ఆభరణాలుగా తయారుచేసి ఇస్తుంటారు. బంగారాన్ని తీసుకొచ్చేందుకు, వీళ్లు తయారుచేసే ఆభరణాల్ని దుకాణాలకు తీసుకెళ్లి ఇచ్చేందుకు.. లైన్‌మెన్ల వ్యవస్థ ఉంది. ఉదయాన్నే తయారీదారుల వద్దకొచ్చి ఆభరణాలు తీసుకుని వెళ్లి.. వాటిని దుకాణాల్లో ఇచ్చి.. సాయంత్రానికి అందుకు సంబంధించిన డబ్బులు తయారీదారులకు అందజేస్తారు. దీనికిగాను లైన్‌మెన్లకు కమీషన్ ఇస్తారు. లైన్‌మెన్లు వ్యాపారుల నుంచి బంగారం తీసుకునేటప్పుడు గానీ, తయారీదారుల నుంచి ఆభరణాలు తీసుకునేటప్పుడు గానీ.. ఎలాంటి రశీదులు ఇవ్వరు. వ్యాపారులు కేవలం నమ్మకంతోనే ఆభరణాలు, బంగారం వారికి ఇస్తుంటారు. కొంతమంది నమ్మకంగా పని చేస్తున్నప్పటికీ ఇదే అదనుగా కొందరు మోసగాళ్లు ఒక్కోసారి బంగారం లేదా ఆభరణాలతో ఉడాయిస్తున్నారు.
సుమారు 5 కోట్లు విలువైన బంగారంతో..
ఇటీవల దిలీప్‌కుమార్ అనే లైన్‌మన్.. 5 కోట్ల 80 లక్షల విలువైన బంగారు ఆభరణాలు తీసుకుని పారిపోయాడు. ఆభరణాలు దిలీప్‌కుమార్‌కు ఇచ్చినట్లు.. వ్యాపారుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. అదృష్టవశాత్తూ వారి వద్ద ఆభరణాలు తీసుకున్న విషయం.. దిలీప్‌కుమార్ డైరీలో రాసి వెళ్లాడు. దాని ఆధారంగా వ్యాపారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళగిరిలో ఇలాంటి మోసాలు ఏడాదికి కనీసం రెండు, మూడైనా జరుగుతుంటాయని స్థానిక వ్యాపారులు చెప్తున్నారు.
ఈ ఘటనల్లో లైన్‌మెన్లపై కేసులు పెట్టేందుకు వ్యాపారుల వద్ద ఎలాంటి ఆధారాలు ఉండడం లేదని.. పోలీసులు చెబుతున్నారు. ఫిర్యాదు లేకుండా నిందితుల్ని వెతకడం, తీసుకురావడం కుదరదని పోలీసులు అంటున్నారు. లైన్‌మెన్లకు రాజకీయ నాయకుల మద్దతుందని.. అందుకే యథేచ్ఛగా మోసాలు కొనసాగుతున్నాయని.. స్థానికంగా విమర్శలు వస్తున్నాయి.
ఇదీ చదవండీ..
బంగారు ఆభరణాల తయారీ పేరుతో ఘరానా మోసం.. 8 కిలోల బంగారంతో పరారీ